కిష్టా’వార్‌’పై న్యాయ విచారణకు ఆదేశం


జమ్మూకాశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా
శ్రీనగర్‌/న్యూఢిల్లీ, ఆగస్టు 12 (జనంసాక్షి) :
జమ్మూకాశ్మీర్‌లోని కిష్ట్వార్‌ జిల్లాలో జరిగిన ఘర్షణలపై న్యాయ విచారణకు జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వం అంగీకరించింది. రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తితో ఘర్షణలపై విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా సోమవారం ప్రకటించారు. మరోవైపు జమ్మూకాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆదివారం ఏడు జిల్లాల్లో కర్ఫ్యూ విధించిన అధికారులు సోమవారం కూడా కొనసాగించారు. ఉదంపూర్‌లో పలు చోట్ల కర్ఫ్యూను సడలించారు.  జమ్మూకు చేరుకునే అన్ని జాతీయ రహదారులపై రాకపోకలను నిలిపివేశారు. పలు చోట్ల మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను కూడా నిలిపివేశారు. పరిస్థితి అదుపులోనే ఉందని డీఐజీ శకీల్‌బేగ్‌ ప్రకటించారు. సాధారణ స్థితికి వస్తే కర్ఫ్యూను సడలిస్తామని చెప్పారు. ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన ఘర్షణను ఉగ్రవాదంతో ముడిపెట్టడం సరికాదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం పేర్కొన్నారు. రాజ్యసభలో సోమవారం ఆయన కిష్ట్వార్‌ జిల్లాలో జరిగిన ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించామని చెప్పారు. కిష్ట్వార్‌లో పరిస్థితి అదుపులోకి వచ్చాక భాజపా నేతలను అనుమతిస్తామని చెప్పారు.