‘అగస్టా’ కొనుగోళ్లలో అక్రమాలు

రైళ్లలో అంతా వ్యాక్‌ : కాగ్‌
న్యూఢిల్లీ, ఆగస్టు 13 (జనంసాక్షి) :
దేశంలోని ప్రముఖ భద్రత కోసం కొనుగోలు చేసిన అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల వ్యవహారాన్ని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) కడిగి పారేసింది. కాగ్‌ నివేదికలో చాపర్‌ డీల్‌లోని అక్రమాలను తేటతెల్లం చేసింది. అగస్టా కంపెనియే 3,966 కోట్లకు హెలికాప్టర్ల అమ్మకానికి ఆఫర్‌ ఇచ్చినప్పుడు రక్షణశాఖ 4,871.50 కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని నిలదీసింది. రక్షణ శాఖ 12 హెలికాప్టర్ల కొనుగోలు విషయంలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిందని కాగ్‌ పేర్కొంది. ఈ ఒప్పందంలో పలు సందర్భాల్లో సేకరణ విధానం, టెండర్లలో రక్షణ శాఖ నిబంధనలు ఉల్లంఘించిందని తెలిపింది. 2007లో హెలికాప్టర్లకు సంబంధించిన పరీక్షలను విదేశాల్లో నిర్వహించాలని నాటి వైనామిక దళ ప్రధానాధికారి తీసుకున్న నిర్ణయాన్ని కూడా కాగ్‌ ప్రశ్నించింది.మరోవైపు దక్షిణ మధ్య రైల్వేశాఖ పనితీరు అత్యంత అద్వానంగా ఉందని కాగ్‌ నివేదించింది. 17 రైల్వే జోన్లలో తనిఖీలు నిర్వహించగా దక్షిణ మధ్య రైల్వేలో ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయని పేర్కొంది. కంపార్ట్‌మెంట్ల నిర్వహణ, ప్రయాణికులకు సదుపాయాల కల్పన అత్యంత దయనీయంగా ఉన్నట్లు అక్షింతలు వేసింది. రైళ్లలో బొద్దింకలు, ఎలుకలు ఎక్కువయ్యాయని, అత్యంత ఖరీదైన రైలు దరంతోలో సైతం అవి అవాసముంటున్నాయని కాగ్‌ తెలిపింది. వాటి నిర్మూలనకు వాడుతున్న రసాయనాలు అత్యంత నాసిరకంగా ఉన్నాయని తెలిపింది. స్టేషన్లలో తాగునీటి ప్రమాణాలు అత్యంత దారుణంగా ఉన్నాయని నివేదించింది. ప్యాంట్రీకార్లలోని మరుగుదొడ్లలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలే ప్రయాణికులకు సరఫరా చేస్తున్నారని కాగ్‌ పేర్కొంది. ఏసీ కంపార్ట్‌మెంట్లలో ఇచ్చే దుప్పట్లు, దిండ్లు అత్యంత దారుణంగా ఉన్నాయంది. విజయవాడ, సికింద్రాబాద్‌, కాచిగూడ, గుంటూర్‌, గుంతకల్లు, కర్నూల్‌, మచిలీపట్నం, డోర్నకల్‌, మిర్యాలగూడ, అక్కన్నపేట, హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్లలో పరిశీలన జరిపినట్లు కాగ్‌ పేర్కొంది.