దీని భావమేమి తిరుమలేశా! మంత్రుల పెళ్లాల రాయబేరం

హైదరాబాద్‌, ఆగస్టు 13 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా సీమాంధ్ర మంత్రుల పెళ్లాలు కూడా రంగంలోకి దిగారు. రాష్ట్రాన్ని విభజించొద్దని, సమైక్యంగానే ఉంచాలని గళమెత్తారు. ఈ మేరకు పలువురు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల భార్యలు మంగళవారం గవర్నర్‌ నరసింహన్‌ కలిసి విజ్ఞప్తి చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మంత్రి శైలజానాథ్‌ భార్య మోక్ష మాట్లాడుతూ.. విభజన వల్ల సీమాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. హైదరాబా ద్‌లోనే అన్ని సదుపాయాలు, అవకాశాలు ఉన్నాయని, సీమాంధ్రలో కనీసం సరైన ఆస్పత్రి కూడా లేదని తెలిపారు. విద్యా, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు లేవని.. తమ పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఇన్నాళ్ల బట్టి హైదరాబాద్‌లో చదువుకున్నందున వేరే రాష్ట్రానికి వెళ్తే వాళ్లు స్థానికేతరులు అవుతారని, అక్కడి వారు కాబట్టి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వరని, ఇలాంటి పరిస్థితే చాలా మందికి ఉందని తెలిపారు. ఓట్లు సీట్ల కోసమే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని మండిపడ్డారు. విభజిస్తే సీమ ఎడారవుతుందని, అసలు తమప్రాంతంలో విద్యాసంస్థలు, కంపెనీలే లేనందున తమ పిల్లలకు చదవులు, ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. తాము హైదరాబాద్‌ వదిలి వెళ్లేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో సీమాంధ్రుల పాత్ర ఎంతో ఉందని, విభజన జరిగితే తాము మళ్లీ యాభై ఏళ్లు వెనక్కిపోతామన్నారు. తాము వెనక్కు వెళ్లేందుకు సిద్దంగా లేమని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోవడం సరికాదన్నారు. విభజన వద్దని తాము గవర్నర్‌ కోరామన్నారు. ఆనం కుటుంబానికి చెందిన సుచరితారెడ్డి మాట్లాడుతూ.. తాము మద్రాస్‌ నుంచి రావాల్సి వచ్చినప్పుడు ఎంతో బాధ పడ్డామని, ఇప్పుడు కూడా హైదరాబాద్‌లో ఆ పరిస్థితి రావడం బాధాకరమన్నారు. గతంలో తమిళనాడు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏం జరిగిందో తనకు తెలుసని, నాటి బాధను ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నానని చెప్పారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు సామినేని ఉదయభాను సతీమణి విమల, మారెప్పల భార్య రాణి కూడా గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం అభ్యంతరాల నివృత్తికి ఆంటోనీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తే సీమాంధ్ర మంత్రుల పెళ్లాలు గవర్నర్‌ను కలవడంలో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.