సింధూరక్షక్‌లో ఘోరం శ్రీభారీ అగ్ని ప్రమాదం


18 మంది గల్లంతు పలువురి మృతి
సుశిక్ష నిపుణులను కోల్పోయిన నేవ
ఉలిక్కిపడ్డ ప్రపంచ దేశాలు
నావికాదళంలో అతిపెద్ద ప్రమాదం
ముంబయి, ఆగస్టు 14 (జనంసాక్షి) :
భారత నౌకాదళ చరిత్రలో అతి పెద్ది ప్రమాదం జరిగింది. ముంబయిలో నావికాదళానికి చెందిన రేవులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఐఎన్‌ఎస్‌ సింధురక్షక్‌ జలాంతర్గామిలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించి, పేలుడు చోటు చేసుకుంది. అది పూర్తిగా మునిగిపోవడంతో కేవలం కొద్ది భాగం మాత్రమే పైకి కనిపిస్తోంది. అందులో ఉన్న ముగ్గురు అధికారులతో సహా 18 మంది గల్లంతయ్యారు. వారిలో పలువురు మృతి చెందారు. మిగతా వారు కూడా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. జలాంతర్గామి పేలుడుపై విచారణకు నౌకాదళం ఆదేశించింది. ప్రమాద ఘటనపై రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ ప్రధానిని కలిసి వివరించారు. ముంబై నావికాదళ తీరాన్ని గురువారం సందర్శించనున్నట్లు ఆయన చెప్పారు. భారత నౌకాదళానికి చెందిన కిలోక్లాస్‌ జలాంతర్గామి అయిన ఐఎన్‌ఎస్‌ సింధురక్షక్‌లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నావికాదళం సుశిక్షితులైన నిపుణులను కోల్పోయింది. అగ్ని ప్రమాదం జరిగి మంటలు వ్యాపించడంతో పాటు భారీ పేలుడు చోటు చేసుకుంది. 2,300 టన్నుల బరువు ఉండే ఈ జలాంతర్గామిలో భారీ డీజిల్‌ జనరేటర్లు, ఎలక్ట్రికల్‌ బ్యాటరీలు ఉండడంతో పేలుడు సంభవించి ఉంటుందని తెలుస్తోంది. దీంతో మంటలు డాక్‌యార్డుకు అంటుకున్నాయి. నావల్‌ డాక్‌ యార్డుతో పాటు ముంబై అగ్నిమాపక దళానికి చెందిన 12 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది తీవ్రంగా కష్టపడి మంటలను అదుపు చేశారు. అయితే, ప్రమాదంలో ఎంత మంది మరణించారనేది ఇంకా తెలియరాలేదు. తీవ్రంగా గాయపడిన కొందరిన మాత్రం కొలాబాలోని ఐఎన్‌హెచ్‌ఎస్‌ అశ్విని ఆస్పత్రికి తరలించారు. పేలుడు కారణంగా జలాంతర్గామితో పాటు నౌకదళ ఆస్తులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. పటిష్టమైన భద్రతా వలయంలో ఉండే నావల్‌ డాక్‌యార్డులో ఉన్న జలాంతర్గామిలో ప్రమాదానికి గల కారణాలపైనా ఇంకా ఎలాంటి సమాచారం అధికారికంగా వెల్లడించలేదు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని నావీ చీఫ్‌ డీకే జోషి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలేంటో తెలుసుకొనేందుకు బోర్డు ఆఫ్‌ ఎంక్వైరీని నియమించినట్లు నేవీ వెల్లడించింది. ఇదిలా ఉంటే, రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. ప్రమాద ఘటనకు సంబంధించి వివరణ ఇచ్చారు. తాను గురువారం ఘటనా స్థలానికి వెళ్లనున్నట్లు ఆంటోనీ తెలిపారు. బుధవారం పార్లమెంట్‌ ఆవరణలో ఆయన విూడియాతో మాట్లాడారు. ప్రమాదంలో నావికాదళ సిబ్బంది మృతికి సంతాపం తెలిపారు. వారి మృతి తనకెంతో బాధ కలిగిస్తోందని, దేశం కోసం ప్రాణాలు అర్పించారని అన్నారు.
ఇటీవలే మరమ్మతులు..
ఐఎన్‌ఎస్‌ సింధురక్షక్‌ జలాంతర్గామికి ఇటీవలే మరమ్మతులు నిర్వహించారు. రాష్యాలోని జ్వెజ్డోచ్కా నౌకాశ్రయంలో మూడు, నాలుగు నెలల క్రితమే ఈ జలాంతర్గామికి రీఫిటింగ్‌ జరిగింది. ఐఎన్‌ఎస్‌ సింధురక్షక్‌కు రీ ఫిటింగ్‌, ఆధునికీకరణ చేయాలని 2010లో రష్యాతో ఒప్పందం కుదిరింది. అందులో భాగంగానే ఇటీవల ఈ జలాంతర్గమికి అక్కడ మరమ్మతులు నిర్వహించారు. క్లబ్‌ ఎస్‌ క్రూయిజ్‌ మిసైళ్లను, పదికి పైగా భారతీయ, విదేశీ రక్షణ వ్యవస్థలను, సోనార్‌ వ్యవస్థను, రేడియో కమ్యూనికేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ముంబయి నావికాదళ తీరంలో జరిగిన ఘోర ప్రమాదంతో ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి. నౌకాదళ చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రమాదం.