ఈజిప్టులో ఆగని హత్యాకాండ


కాల్పుల్లో 500 మందికిపైగా మృతి
కైరో, ఆగస్టు 15 (జనంసాక్షి) :
ఈజిప్టులో హత్యాకాండ కొనసాగుతోంది. మాజీ అధ్యక్షుడు మోర్సీకి తిరిగి పగ్గాలు అప్పగించాలని కోరుతూ ఆయన మద్దతుదారులు ఆందోళనలు తీవ్రతరం చేస్తూనే ఉన్నారు. అక్కడి సైన్యం వారిని అణచివేయడానికి ఎంతకైనా వెనుకాడ్డం లేదు. యుద్ధట్యాంకులను సైతం ఆందోళనకారులపైకి నడిపిస్తుండటంతో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈజిప్టులో మొర్సీ నేతృత్వంలో ఏర్పడిన ప్రజాస్వామిక ప్రభుత్వం కొద్దికాలంలోనే ఎక్కువ మంది విశ్వాసాన్ని కోల్పోయారు. ఆయన వ్యతిరేకంగా పౌర ఆందోళనలు పెరిగిపోవడంతో వారిని నియంత్రించేందుకు రాజ్యాంగంలో మార్పులు చేసేందుకు మొర్సీ విఫలయత్నాలు చేశారు. ఈనేపథ్యంలో సైన్యం ఆయనను పలుమార్లు హెచ్చరించింది. అయినా తన పంథాను కొనసాగించారు. దీంతో 48 గంటల్లోగా గద్దె దిగాలని జూలై ఒకటిన సైన్యం మొర్సీని హెచ్చరించింది. అయినా ఆయన వెనక్కు తగ్గకపోవడంతో జూలై 3న ఆయనను సైన్యం పదవీచ్యుతిడిని చేసింది. అప్పటి నుంచి ఆయన మద్దతుదారులు ఆందోళనలు తీవ్రం చేశారు. వారిని అదుపు చేసేందుకు సైన్యం చేపట్టిన చర్యల్లో ఇప్పటి వరకు 500 మందికిపైగా మృత్యువాతపడ్డారు. రెండు రోజుల క్రితం తాత్కాలిక ప్రభుత్వం దేశంలో అత్యయిక పరిస్థితిని విధించింది. అయినా పరిస్థితిలో మార్పురాలేదు. గురువారం జరిగిన ఆందోళనల్లో 150 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అంతర్యుద్ధం కారణంగా దేశంలో ప్రజాజీవనం అస్తవ్యస్తమైపోయింది. విద్యుత్‌, ఆహార కొరతతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.