టీడీపీ సీనియర్‌ నేత లాల్‌జాన్‌ బాషా రోడ్డు ప్రమాదంలో మృతి

స్వతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తూ…
నల్గొండ , ఆగస్టు 15 (జనంసాక్షి) :
తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా గురువారం తెల్లవారుజా మున నల్గొండ జిల్లాలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఉదయం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గుంటూరులో నిర్వహించుకునేందుకు బయల్దేేరి వెల్లగా ఆరుగంటల సమయంలో నార్కట్‌పల్లి వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో లాల్‌జాన్‌పాషా అక్కడికక్కడే మృతి చెందారు. 56సంవత్సరాల వయస్సున్న పాషా 1991లో గుంటూరు నుంచి లోక్‌సభకు పోటీచేసి గెలుపొందారు. ఆతర్వాత  పార్టీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. చంద్రబాబు నమ్మిన బంటుగా వ్యవహరించే బాషా లేడనే వార్త పార్టీ కార్యకర్తలను విస్మయానికి గురిచేసింది. గుంటూర్‌ జిల్లాలో ఇనుము వ్యాపారం చేసుకుంటున్న బాషా ఎన్టీఆర్‌ విధానాలకు ఆకర్షితులై ఆదిలోనే టిడిపిలో చేరారు. అప్పటి నుంచి క్రమశిక్షణగల కార్యకర్తగా మెదులుతున్నారు. గుంటూర్‌ జిల్లాలో మైనార్టీలకు పెద్దదిక్కుగా మారి సేవలందిస్తున్నారు. తరువాత వరుసగా ఓటములు చెందుతూనే వచ్చారు. అయినా సరే పార్టీని మాత్రం వీడకుండా సేవలు అందిస్తున్నారు.ఆయన సేవలు గుర్తించిన బాబు 2002లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్‌ చేశారు. ఆపదవిలో 2008 వరకు పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఇస్లామిక్‌ బ్యాంక్‌ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. గుంటూరులో శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో, దేశంలో నీతికి నిజాయితీకి మారుపేరుగా సేవలందించిన మ¬న్నత వ్యక్తి లాల్‌జాన్‌పాషా అని, ఆయన మృతి టిడిపికి తీరని లోటని ఆపార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడు పేర్కొన్నారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆపార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు లాల్‌జాన్‌పాషా మృతదేహాన్ని నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం హుటాహుటిన నల్గొండకు తరలి వెల్లారు. ఆసుపత్రిలో ఆయనకు జిల్లా నాయకులు స్వాగతం పలికారు. చంద్రబాబు రాగానే పాషా కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తమ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయామని, తమను ఆదుకునే వారెవ్వరంటూ రోదించారు. బాబు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో ఆసుపత్రి వాతావరణం అంతా విషాదంగా మారిపోయింది. మృతదేహాన్ని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి జానారెడ్డి తదతరులు కూడా సందర్శించి నివాళులర్పించారు. ఈసంఘటన దావానంలా విస్తరించడంతో జిల్లా నలుమూలలనుంచి టిడిపి శ్రేణులు నల్గొండ జిల్లాకేంద్రానికి తరలి వచ్చారు. దీంతో వారిని అదుపు చేయడం పోలీసులకుతలకు మించిన భారంగా మారింది. పోస్ట్‌మార్టం అనంతరం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి  తరలించనున్నారు. ఈసందర్బంగా బాబు మాట్లాడుతూ తాను అత్యంత ఆప్తుడిని కోల్పోయానన్నారు. పార్టీకి తీరని లోటన్నారు. రోడ్డు ప్రమాదాల్లో నేతలు చనిపోవడం తీవ్రంగా కలిచివేస్తుందన్నారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాబు కోరారు. కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటానన్నారు.