ఆంటోనీ కమిటీని కలిసిన సీమాంధ్రులు


నీళ్లు, హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రత, ఉద్యోగులు, వాటాలపై చర్చ
న్యూఢిల్లీ, ఆగస్టు 15 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో అభ్యంతరాలు చెప్పుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన ఏకే ఆంటోనీ కమిటీని సీమాంధ్ర నేతలు గురువారం సాయంత్రం కలిశారు. వార్‌ రూమ్‌లో వారు ఆంటోనీతో భేటీ అయి హైదరాబాద్‌పై తమ అభ్యంతరాలు చెప్పడం ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఉండే వారిపై అభ్యంతరాలు మినహా హక్కుల కోసం అడగొద్దని ఆంటోనీ కరాఖండిగా చెప్పడంతో విభజన అనంతరం ఉత్పన్నమయ్యే పరిస్థితులను వివరించారు. నీళ్లు, హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రత, ఉద్యోగులు, వాటాలపై తమ అభ్యంతరాలను వివరించారు. సమావేశం అనంతరం కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీడియాతో మాట్లాడారు. మంత్రి తోట నర్సింహం భార్య వాణి దీక్ష విరమించాలని కోరారు. ఈనెల 19, 20 తేదీల్లో ఆంటోనీ కమిటీ తిరిగి సమావేశమవుతుందని తెలిపారు. విభజన తర్వాత వచ్చే పరిస్థితులపై సీమాంధ్ర ఎంపీలు తమ వాదనలు వినిపించారన్నారు. వారు చెప్పిన విషయాలు కమిటీ నమోదు చేసుకుందని అన్నారు. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థుల సమస్యపై ప్రధానంగా చర్చ సాగిందన్నారు. త్వరలోనే తాను హైదరాబాద్‌లో పర్యటిస్తానని, కమిటీ మాత్రం హైదరాబాద్‌కు రాదని మరోసారి తేల్చేశారు.