పాతాళంలోకి రూపాయి


ముంబయి, ఆగస్టు 16 (జనంసాక్షి) :
భారత మారక ద్రవ్యం రూపాయి పాతాళానికి చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మళ్లీ అత్యంత కనిష్ట స్థాయికి క్షీణించింది. అంతర్జాతీయ ఎక్స్ఛేంజ్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకం పెరగడంతో రూపాయి మరింత క్షీణించింది. శుక్రవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.62.03కు చేరడంతో దేశీయ కరెన్సీ మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. మొట్టమొదటి సారిగా రూపాయి 62 కంటే కనిష్ట స్థాయికి పడిపోయింది. రూపాయి భారీ పతానికి డాలర్‌ మారకంలో హెచ్చుతగ్గులే కారణమని ప్రభుత్వ సంస్థ క్యాడ్‌ పేర్కొంది. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసే దిశగా భారత రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) మరిన్ని చర్యలు ప్రకటించింది. విదేశీ మారకం నిల్వలు తరలించకుండా చూసే విధంగా బంగారం దిగుమతులపై బుధవారం ఆంక్షలు పెంచింది. లైసెన్స్‌ లేకుండా బంగారు నాణేలు, పతకాలు తదితరాలు దిగుమతి చేసుకోరాదని నిషేధం విధించింది. ఇకపై బంగారాన్ని ఏ రూపంలో దిగుమతి చేసుకోవాలన్నా డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) లైసెన్స్‌ తప్పనిసరిగా కావాలి. అలాగే, దేశీయ కంపెనీలు విదేశాల్లో పెట్టే ప్రత్యక్ష పెట్టుబడులపైనా ఆర్‌బీఐ పరిమితులు విధించింది. ఇప్పటిదాకా నికర విలువపై 400 శాతం దాకా ఆటోమేటిక్‌ పద్ధతిలో అనుమతిస్తుండగా, దీన్ని వంద శాతానికి తగ్గించింది. అయితే ఆయిల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ విదేశాలకు మాత్రం దీన్నుంచి మినహాయింపునిచ్చింది. లిబరలైజ్డ్‌ రెమిటెన్సెస్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద భారతీయులు విదేశాలకు పంపే రెమిటెన్స్‌ మొత్తాలను కూడా బీఐ తగ్గించింది. ప్రస్తుతం ఈ తరహా రెమిటెన్స్‌లు ఏడాదికి 2 లక్షల డాలర్ల దాకా అనుమిస్తుండగా, దీన్ని 75 వేల డాలర్లకు తగ్గించింది. అవసరమైతే మరిన్ని విధానపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అరవింద్‌ మాయారామ్‌ తెలిపారు. రూపాయి భారీ పతనంతో ప్రారంభంలోనే మార్కెట్లు భారీ కుదుపునకు లోనయ్యాయి. సెన్సెక్స్‌ 491 పాయింట్లు, నిఫ్టీ 162 పాయింట్లు కోల్పోయింది.