విద్వేషాలతో విడిపోవద్దు


సీమాంధ్రులకు జానా హితవు
హైదరాబాద్‌, ఆగస్టు 16 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పడే వేళ సీమాంధ్రులు విద్వేషాలతో విడిపోవద్దని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కె. జానారెడ్డి హితవు చెప్పారు. పూర్తి స్థాయి సంప్రదింపుల తర్వాతే విభజనకు అధిష్టానం అంగీకరిం చిందని తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు, రాష్ట్రాలుగా విడిపోయి ఒకే జాతిగా కలిసుందామని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్రులు సహకరించాలని, తెలుగు జాతి ఐక్యతను కాపాడుకోవాలని కోరారు. తెలుగు వారు ఒక్క మన రాష్ట్రంలోనే లేరని.. అనేక రాష్ట్రాల్లో ఉన్నారని చెప్పారు. దేశంలోనే తెలుగు వారు తెలివైన వారని, ఇతర దేశాలు, రాష్ట్రాల్లో తెలుగు వారు ఉన్నత పదవుల్లో ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్రపతిగా పని చేసిన నీలం సంజీవరెడ్డి, వీవీ గిరి ప్రముఖులు పని చేశారని తెలిపారు. తెలుగు జాతి ఔన్నత్యం గురించి అంతా గర్వపడాలన్నారు. సీమాంధ్రులు కలిసి ఉండాలని సదుద్దేశంతోనే మాట్లాడుతున్నారు, కానీ ఐదు దశాబ్దాల్లో ఏ ఒప్పందం అమలుకు నోచుకోకపోవడం వల్లే తెలంగాణ ఆకాంక్ష పుట్టుకొచ్చిందని చెప్పారు. 12 సంవత్సరాలుగా సంప్రదింపులుగా ప్రక్రియ జరిపిన తర్వాతే విభజనకు కేంద్ర నాయకత్వం పూనుకుందన్నారు. తెలుగు ప్రజల మధ్య ఉన్న ప్రేమాభిమానాలు 15 రోజులుగా తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విభజన వల్ల సమస్యలు, ప్రయోజనాల గురించి ఆలోచించాలని ఆయన హితవు పలికారు. కృష్ణా, గోదావరి నదుల నీటి పంపకాల గురించి ఆందోళన చెందాల్సిన అసవరం లేదని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర నదీ జలాల పంపకంలో సమస్యలు ఉండవని తెలిపారు. ఐదు దశాబ్దాల్లో ఒక్క ఒప్పందం కూడా అమలు కాలేదని, తెలంగాణపై సంప్రదింపుల ప్రక్రియ ఎంత సుదీర్ఘంగా జరిగిందో అందరికీ తెలిసిందేనన్నారు. విభజన ప్రకటన వచ్చిన తర్వాత తెలంగాణపై నిర్ణయాన్ని అధిష్టానం వెనక్కి తీసుకొనే అవకాశమే లేదని డీఎస్‌ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్టామని కాంగ్రెస్‌ హైకమాండ్‌, యూపీఏ చెప్పాయని నిర్ణయాన్ని వెనక్కు తీసుకొనే అవకాశం లేదన్నారు. విభజనపై వెనక్కి వెళ్లే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదని, ఢిల్లీ పెద్దలు కూడా అదే మాట చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ తరుణంలో సీమాంద్ర ప్రజలు ఆందోళనలు విరమించి విభజనకు సహకరించాలని కోరారు. విభజన వల్ల తలెత్తే సమస్యలకు పరిష్కార మార్గాలపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణ ఏర్పాటు వల్ల వచ్చే సమస్యలపై ఆలోచన చేయడం తప్పు కాదని, అయితే, వాటి గురించి కూర్చొని చర్చించాలని చెప్పారు. సీమాంధ్ర ప్రంతంలో కొత్తగా వచ్చే పోర్టులతో కలిపి నాలుగు పోర్టులున్నాయని గుర్తు చేశారు. సీమాంధ్రలో ఉన్నన్ని నగరాలు తెలంగాణలో లేవని చెప్పారు. సీమాధ్రకు మంచి రాజధాని నిర్మించేందుకు ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, కనుక సీమాంధ్రులకు ఇది మంచి అవకాశమని తెలిపారు. ఏకాభిప్రాయం తర్వాతే, అన్ని పార్టీలు తెలంగాణ ఇవ్వాలని చెప్పిన తర్వాతే.. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ మొదలైందని ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణలో ఉన్న సీమాంద్ర ఎలాంటి ఇబ్బందులు ఉండవని, వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా కేంద్రం సమస్యను పరిష్కరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భిన్నాభిప్రాయాలు ఉన్నా తెలుగు వాళ్లంతా ఒక్కటేనని.. ఉద్యోగుల మధ్య అపోహలు తొలగించడానికి గాను ఉభయులు కలిసి చర్చించుకోవచ్చని చెప్పారు. తనకు రెండు వైపులా ప్రజలతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా ప్రస్తుత పరిస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను అర్థం చేసుకొని సానుకూల ధోరణితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు.