యూటీగా అంగీకరించం హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగం


19న ఆంటోనీ కమిటీని కలుస్తాం : టీ మంత్రులు
హైదరాబాద్‌, ఆగస్టు 17 (జనంసాక్షి)
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాం తంగా అంగీకరించబోమని, ఎప్పటికీ హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగ మేనని టీ మంత్రులు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్రులకు రక్షణ కల్పించేందుకు కేంద్రం తీసుకునే ఏ విధమైన నిర్ణయానికైనా తాము కట్టుబడి వుంటామని కాంగ్రెస్‌ తెలంగాణ ప్రాంత నాయకులు అన్నారు. పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణతో భేటీ తరువాత మీడియాతో వారు మాట్లాడారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా అంగీకరించబోమని మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, దానం నాగేందర్‌, పార్లమెంట్‌ సభ్యుడు పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నందున అది తప్ప మిగతా అంశాలపై చర్చిస్తే మంచిదని తెలంగాణ నాయకులు సూచించారు. సమస్యల పరిష్కారానికి అభిప్రాయాలను వెల్లడించాలని బొత్స తెలిపారు. ముందుగా సీమాంధ్ర నేతల అభ్యంతరాలేంటో తెలిస్తే వాటి పరిష్కారానికి తగిన సూచనలు ఇవ్వగలుగుతామని కొందరు నేతలు బొత్సతో అన్నారు. తమకు చెప్పకుండా విభజన ప్రకటన చేశారని ముఖ్యనేతలు అనడంలో అర్థం లేదని వివరించారు. విభజన విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి వుంటామని ముఖ్యమంత్రి సహా ముఖ్యనేతలంతా బాహాటంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు వారే సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లాడడం సరికాదని ఆయన అన్నారు. అయితే ఈనెల 19న అంటోనీ కమిటీని లుస్తామని మంత్రి శ్రీధర్‌బాబు అనడంతో అదేరోజు రాత్రి 8 గంటలకు ఆంటోనీ కమిటీతో తెలంగాణ ప్రాంత నేతలు భేటీ అయ్యేందుకు బొత్స సమయం కేటాయించారు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానికి, శాంతి భద్రతలు కేంద్ర పర్యవేక్షణలో వుండేందుకు తాము అంగీకరిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ విషయంలో కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా ట్టుబడి వుంటామని వివరించారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణకు మాత్రమే అంగీకరిస్తామని, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామంటే ఒప్పుకునేది లేదని మంత్రి దానం నాగేందర్‌ స్పష్టం చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు ఆంటోనీ కమిటీకి వారి అనుమానాలు, ఇబ్బందులు తెలియజేస్తున్నారని, తాము కూడా కమిటీని కలిసి అనుమానాలను నివృత్తి చేస్తామని మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. కాగా, ఆంటోనీ కమిటీనీ గ్రేటర్‌ మంత్రులు ప్రత్యేకంగా కలుస్తామని, అందుకు మరోరోజు సమయం కేటాయించాలని బొత్సను కోరినట్లు దానం నాగేందర్‌ వివరించారు.