ప్రతిదాడులకు పరిస్థితులను ప్రేరేపించొద్దు


హరీశ్‌ హెచ్చరిక
హైదరాబాద్‌, ఆగస్టు 17 (జనంసాక్షి) :
సీమాంధ్రులు ప్రతిదాడులకు పరిస్థితులను ప్రేరేపించొద్దని సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీశ్‌రావు అన్నారు. తెలంగాణకు చెందిన విద్యార్థులను, ఉద్యోగులను చిట్టచివరికి సీనియర్‌ కాంగ్రెస్‌ నేతను సైతం వదిలి పెట్టకుండా చెప్పులు రాళ్లతో దాడులు చేయడమే సీమాంధ్ర సంస్కృతా అని టిఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశష్‌రావు తీవ్రస్థాయిలో మండి పడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆయన రాజేందర్‌, రవీందర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. యాభై ఏల్లుగా ఇలాంటి నికృష్టమైన చర్యలకు పాల్పడుతుండడం వల్లే తాము విడిపోవాలని ఉద్యమిస్తున్నామన్నారు. శనివారం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన అపార రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్‌ నేత విహన్మంతరావుపై చెప్పులు, రాల్లతో దాడి చేయడాన్ని టీఆర్‌ఎస్‌ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఇదేనా కలిసి ఉండాలని కోరుకునే వాళ్లు చేసే పని అని ఆయన సీమాంధ్ర నేతలను, జేఏసీలను ప్రశ్నించారు. నాలుగు రోజుల ఉద్యమంలోనే సంయమనం కోల్పోయి దాడులకు పాల్పడుతుండడం ఏం నీతని ప్రశ్నించారు. తెలంగాణలో 13ఏళ్లపాటు ఏఒక్క సీమాంధ్ర నేతపైగాని, పౌరులపై గాని దాడిచేయలేదని గుర్తుచేశారు. అసలు సీమాంధ్ర ఉద్యమానికి దిశ, దశ ఉందాని హరీష్‌రావు ప్రశ్నించారు. పదిజిల్లాల ప్రజలు, నేతలు కలిసి ఉండలేం అంటుంటే బలవంతంగా కలిసి ఉందామనడం ఏం నీతన్నారు. దేశాలు దాటి వచ్చిన వారిపై ఇంకేరకంగా దాడులు చేస్తారని ఆయన ప్రశ్నించారు. వీహెచ్‌పై దాడికి పాల్పడ్డ తీరు చూస్తుంటే రేపు ఇంకెవరూ తిరుమలకు రావద్దా అన్నారు. హైదరాబాద్‌లో ఇలాగే తాము వ్యవహరించి ఉంటే  పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవాలన్నారు. ఈ దాడులకు సీమాంధ్ర జేఏసీతో పాటు రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రాంతాలుగా విడిపోయి ఆత్మీయుల్లా కలిసి ఉందామని తాము ఇప్పటికీ కోరుకుంటున్నామన్నారు. తమ ఓపికకు, సహనానికి కూడా హద్దు ఉంటుందన్నారు. అదే దాటితే ఏం అవుతుందో అర్థం చేసుకోవాలని హెచ్చరించారు. తాము అలా వ్యవహరించాలనుకోవడం లేదని, అది జరుగకూడదనేదే తమ అభిమతమన్నారు. ఏదైనా జరిగితే ఏం సమాధానం చెపుతారని ఆయన నిలదీశారు. ఇప్పటికే ఎన్నో రకాలుగా తెలంగాణ ఉద్యోగాలను దోచుకున్న సీమాంధ్ర పాలకులు ఇప్పటికిప్పుడు కూడా ఓ అనర్హుడిని దేశంలోనే అత్యంత పేరెన్నికగన్న ప్రకృతి వైద్యశాల, కళాశాలకు డైరెక్టర్‌గా ఎలాంటి అర్హతలు లేని వ్యక్తిని డైరెక్టంగా నియమించాలని సీఎం చూస్తున్నాడని ఆరోపించారు. కేవలం యోగా నేర్పే జూనియర్‌ అయిన సాయిరాంను ఏకంగా డైరెక్టర్‌గా నియమించేందుకు సీమాంధ్ర పాలకులు ఉత్తర్వులు జారీ చేయనున్నారని తెలిసిందన్నారు. ఇప్పటికైనా దానిని రద్దు చేయకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. సాయిరార కంటే 27 మంది సీనియర్లు, అర్హతలున్న వారున్నా కూడా వారందరిని పక్కన పెట్టి అతి జూనియర్‌ అయిన వ్యక్తిని ఏకంగా డైరెక్టర్‌గా నియమించాలనుకోవడం దుర్మార్గమే అన్నారు. తెలంగాణకు చెందిన మంత్రులు వెంకటరెడ్డి, సారయ్యలు అతి సీనియర్‌ అయిన ప్రొఫెసం నీరజారెడ్డిని నియమించాలని కోరినా ప్రక్కన పెట్టారన్నారు. గతంలోనే ఓసారి హెచ్‌ఓడిగా నియమించగా ట్రిబ్యునల్‌ ప్రభుత్వంపై మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు. నిన్నటికి నిన్న హెచ్‌ఓడికి పనికి రాని వ్యక్తి నేడు ఏకంగా సుప్రసిద్దమైన ఆసుపత్రి, విశ్వవిద్యాలయానికి డైరెక్టర్‌గా నియమించాలనుకోవడం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తగునా అని అయన ప్రశ్నించారు. వెంటనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోక పోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హరీష్‌రావు హెచ్చరించారు.