బరితెగించిన సోకాల్డ్‌ సమైక్యవాదులు


వీహెచ్‌ వాహనంపై దాడి
కారుపై పాదరక్షలు విసిరిన దుండగులు
దైవ దర్శనానికి వెళ్తే దారుణంగా వ్యవహరించిన ఆగంతకులు
ముక్తకంఠంతో ఖండించిన తెలంగాణవాదులు
తిరుమల/హైదరాబాద్‌, ఆగస్టు 17 (జనంసాక్షి) :
సోకాల్డ్‌ సమైక్యవాదులు బరితెగిం చారు. రాజ్యసభ సభ్యుడు వి. హను మంతరావుపై తిరుమల వెంకన్న సాక్షిగా దాడికి తెగబడ్డారు. కలిసుం దామంటూనే తెలంగాణ వారిపై రోజుకో చోట దాడులకు పాల్పడుతూ వైషమ్యాలు పెంచుతున్నారు. తిరు మల శ్రీవారిని దర్శించుకొని తిరిగి వెళ్తున్న వీహెచ్‌ వాహనంపై కొందరు దుండగులు చెప్పులతో దాడి చేశారు. శ్రీవారిని దర్శనం కోసం వీహెచ్‌ శనివారం ఉదయం తిరుమల చేరుకున్నారు. స్వామి వారి దర్శనానంతరం ఆయన హైదరాబాద్‌కు తిరిగి వచ్చేందుకు ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. అయితే, తిరుపతిలో సమైక్యవాదులు అడ్డుకొనే అవకాశం ఉందని పోలీసులు ఆయనను తిరుమల కొండపైనే చాలాసేపు ఉంచారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన అనంతరం ఆయనను భారీ భద్రతా నడుమ తీసుకువచ్చారు. అయితే, ఆయనను పలుచోట్ల అడ్డుకొనేందుకు సమైక్య వాదులు యత్నించారు. అలిపిరి సమీపంలో మాటు వేసిన ఆందోళనకారులు వీహెచ్‌ అడ్డుకొనేందుకు యత్నించగా, పోలీసులు వారిని నెట్టివేశారు. స్వల్పంగా లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. అయితే, తాము వీహెచ్‌ను అడ్డుకోబోమని, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గులాబీ పూలు ఇచ్చి నిరసన తెలుపుతామని ఆందోళనకారులు చెప్పడంతో పోలీసులు ఐదుగురిని అనుమతించారు. వారి నుంచి గులాబీలు తీసుకొని ముందుకు కదిలిన వీహెచ్‌ వాహనాన్ని అలిపిరి వద్ద ఆందోళనకారులు అడ్డుకున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని నియంత్రించేందుకు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలోనే కొందరు దుండగులు వీహెచ్‌ వాహనంపైకి చెప్పులు విసిరారు. పోలీసులు వారిని అడ్డుకొని వాహనాన్ని ముందుకు తీసుకెళ్లారు.
హైదరాబాద్‌ను వదిలెళ్లాల్సిందే: వీహెచ్‌
ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా హైదరాబాద్‌ను వదిలివెళ్లాల్సిందేనని వీహెచ్‌ స్పష్టం చేశారు. అంతకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రులు ఉద్యోగాల కోసం కాకుండా సాధారణంగా ఉండేందుకు అనుమతిస్తామని తెలిపారు. ఏపీ ఎన్జీవోల సమ్మెను నడిపిస్తున్నది నాయకులేనని విమర్శించారు. సమైక్య ఉద్యమం కృత్రిమ ఉద్యమమని.. తెలంగాణ ఉద్యమం ఆంద్రప్రదేశ్‌ ఏర్పడినప్పటి నుంచీ ఉందని స్పష్టం చేశారు. నాలుగుసార్లు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి, అన్ని పార్టీలతో మాట్లాడిన తర్వాతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. అడ్డగింపులకు తాను భయపడబోనని, తన రాజకీయ జీవితంలో ఇలాంటివెన్నో చూశానని తెలిపారు.
విద్వంసాలు, ఉద్వేగాలు జరుగకుండా చూడాలి : జానారెడ్డి
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం అన్నిరకాలుగా ఆలోచించాకే నిర్ణయం తీసుకుందని, అన్ని ప్రాంతాలకు చెందిన నేతలను సంప్రదించాకే కేంద్రం రాష్టాన్న్రి ఏర్పాటు చేస్తుంటే సీమాంధ్రులు కావాలనే రాద్దాంతం చేస్తున్నారని రాష్ట్రమంత్రి జానారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇరు ప్రాంతాల ప్రజలు రాగద్వేషాలకు తావివ్వకుండా ఉండాలని పదే పదే చెప్తున్నా కూడా సీమాంధ్రలో ఉద్యమకారులు తెలంగాణాకు చెందిన వారిపై దాడులకు పాల్పడుతుండడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్‌లో సీనియర్‌ నేత, సౌమ్యుడిగా ఉన్న ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావుపై తిరుమలలో జేఏసీ నేతలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజల మద్య సామరస్యం తగ్గకముందే కేంద్రం సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చేయాలన్నారు. ఈ తరుణంలో ప్రతి ఒక్కరు సంయమనం పాటించేలా రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దాడుల సంస్కృతి పునరావృతం కాకుండా ఆందోళనకారులను మోటివేట్‌ చేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. కొందరు ఆవేశపూరితంగా చేసే చర్యలు తీవ్రంగా విద్వేషాలకు గురిచేస్తుంటాయన్నారు. ఇలాంటి చర్యలు ఇరు ప్రాంతాల ప్రజల మద్య దూరాన్ని పెంచుతాయని మాత్రం గుర్తుంచుకోవాలన్నారు. అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని జానారెడ్డి కోరారు. ఇప్పటికైనా ప్రాంతాలుగా విడిపోదాం ఆత్మీయుల్లా కలిసి ఉందామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడే సమస్యలన్నింటిని పరిష్కరించుకునేందుకు మార్గాలుంటాయన్నారు. గత 13 ఏల్లుగా తెలంగాణలో ఆందోళనలు జరుగుతున్నా ఏనాడూ సీమాంధ్ర నేతలపై ఉద్యమకారులు దాడులకు పాల్పడలేదని గుర్తుచేశారు. ఈతరుణంలో అలాంటి చర్యలకు పాల్పడి మరింత దూరం పెంచకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.