బలవంతంగా కలిసుండాలనడం రాజ్యాంగ వ్యతిరేకం


టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
హైదరాబాద్‌, ఆగస్టు 17 (జనంసాక్షి) :
బలవంతంగా కలిసుండాలనడం రాజ్యాంగ వ్యతిరేకమని టీజేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర నేతలు, ఉద్యోగులు చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమం రాజ్యాంగ వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన టీజేఏసీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణను మాత్రమే జేఏసీ అంగీకరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కొత్త రాజధాని ఏర్పడే వరకు సీమాంధ్రులకు హైదరాబాద్‌లో తాత్కాలిక రాజధానికి అంగీకరిస్తామని ఆయన తెలిపారు. కేంద్రమంత్రి వర్గం తెలంగాణపై తీర్మానం చేసి ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయించే అధికారం లేదన్నారు. తాము ఢిల్లీ వెళ్లి ఏ కాంగ్రెస్‌ నేతలను కలువలేదు అని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఏపీ ఎన్జీవోలు ఎలా సభ పెడతారో చూస్తామని ఆయన అన్నారు. ఈనెల 19 నుంచి వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా శాంతి ర్యాలీలు, సద్భావన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. శాంతిర్యాలీలు, సద్భావన సదస్సుల నిర్వహణలో తెలంగాణవాదులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలువునిచ్చారు. సీమాంధ్ర ప్రజలు తెలంగాణ ఏర్పాటుకు సుముఖంగా ఉన్న కొందరు పెట్టుబడిదారులు ఆ ప్రాంతంలో కృత్రిమ ఉద్యమాన్ని నడుపుతూ ప్రజల మధ్య విద్వేషాలను రగుల్చుతున్నారని మండిపడ్డారు.  ిఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు సంయమనంతో వ్యవహరిస్తూ కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించాలని సూచించారు. శాంతి, సద్భావన ర్యాలీల ద్వారా తెలుగు వారంతా రెండు రాష్ట్రాల్లో ఉన్న ఒక్కటేనని చాటిచెప్పాలన్నారు.