హైదరాబాద్‌ తెలంగాణదే కేంద్రం పెత్తనం ఆమోదించం


తెలంగాణలో త్వరలో కేసీఆర్‌ పర్యటన : టీఆర్‌ఎస్‌
మెదక్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) :
హైదరాబాద్‌ ఎప్పటికైనా తెలంగాణదేనని, ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని అంగీకరించబోమని టీఆర్‌ఎస్‌ స్పష్టం చేసింది. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాలని ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆదివారం సాయంత్రం పార్టీ ముఖ్యనేతలతో టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు తన వ్యవసాయ క్షేత్రంలో సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలను వెల్లడించారు. హైదరాబాద్‌పై ఎలాంటి కిరికిరి చేయొద్దు అని ఆయన కోరారు. తెలంగాణకు హైదరాబాద్‌ను రాజధానిగా ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్‌కు సంబంధించినంత వరకు సీమాంధ్ర నాయకులు, కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక రకంగా కిరికిరి చేయాలని చూస్తున్నట్లు తమకు అనిపిస్తుందని చెప్పారు. హైదరాబాద్‌ పట్టణం తెలంగాణ రాష్ట్రంలోనే ఉండేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌ శాంతిభద్రతలు కేంద్రం చేతిలో ఉన్న ఫర్వాలేదని ఆంటోనీ కమిటీకి కొందరు టీకాంగ్రెస్‌ నేతలు చెప్పినట్లు తమకు తెలిసిందని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని స్షష్టం చేశారు. హైదరాబాద్‌ అధికారాలు తెలంగాణ రాష్ట్రానికే వుండాలని ఆయన చెప్పారు. హైదరాబాద్‌ లేని తెలంగాణను ఇక్కడి ప్రజలు ఒప్పుకోరని కడియం తేల్చిచెప్పారు.
త్వరలో కేసీఆర్‌ జిల్లాల పర్యటన :
త్వరలోనే కేసీఆర్‌ పది జిల్లాలలో పర్యటిస్తారని కడియం శ్రీహరి తెలిపారు. పది జిల్లాలో పర్యటించాలని పార్టీ నేతలు కేసీఆర్‌ను కోరడం జరిగిందని చెప్పారు. ఇందుకు కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్‌ పర్యటన కరీంనగర్‌ జిల్లా నుంచి ప్రారంభం అవుతుందని చెప్పారు. కేసీఆర్‌ పర్యటనకు సంబంధించి ఒకటీరెండు రోజుల్లో పర్యటన షెడ్యూల్‌ ఖరారు చేసి మీడియాకు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.