పది జిల్లాల తెలంగాణే ఆంటోనీ కమిటీకి స్పష్టం చేస్తాం


హైదరాబాద్‌పై పీటముడి పెడితే తెలంగాణ ఇచ్చినట్టుండదు : టీ మంత్రులు
హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) :
సీడబ్ల్యూసీ తీర్మానాన్ని యధా తథంగా అమలు చేయాలని, పది జిల్లాల తెలంగాణే ఏర్పా టు చేయాలని అధిష్టానాన్ని కోరుతున్నట్టు టీ మంత్రులు తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని మంత్రుల క్వార్టర్స్‌లో తెలం గాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆదివారం భేటీ అయ్యారు. భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాలు ఉండాలని తీర్మానించారన్నారు. ఉమ్మడి రాజధాని తమకు ఆమోదమేనని అన్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు ఢిల్లీలో కేంద్రమంత్రి ఆంటోనీతో భేటీ కానున్నట్టు చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంపై తమ అభిప్రాయాలను వెల్లడించనున్నట్టు తెలిపారు. నదీజలాల విభజనపైనా, హైదరాబాద్‌ రాజధానిపైనా, భద్రాచలం విషయంపైనా తమ తమ అభిప్రాయాలను తెలియజేయనున్నట్టు చెప్పారు. ఆంటోనీతో తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ కానున్నట్టు చెప్పారు. శనివారం తిరుపతిలో వీహెచ్‌పై జరిగిన దాడిని, ఇటీవల తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులపై సీమాంధ్రుల దాడిని ఖండిస్తున్నామని అన్నారు. సామరస్యంగా విడిపోదాం.. విడివిడిగా  ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం అని అన్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్ర ప్రాంతానికి చెందిన విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఎలాంటి అభద్రతాభావానికి లోను కావొద్దని చెప్పారు. అందరూ స్వేచ్ఛగా తమ తమ దైనందిన కార్యక్రమాల్లో కొనసాగాలని, అపోహలను, పుకార్లను నమ్మవద్దని కోరుతున్నామన్నారు. ఆందోళనలు విరమించాలని సీమాంధ్ర ప్రాంత సోదరులను కోరుతున్నామని చెప్పారు. శాంతియుతంగా విభజన జరగాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు.