సీఎం సీమాంధ్ర పాక్షపాతిగా వ్యవహరిస్తుండు


నేటి నుంచి ఇందిరాపార్కు వద్ద శాంతిదీక్షలు : కోదండరామ్‌
మహబూబ్‌నగర్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రాంత నాయకుడిగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మండిపడ్డారు. విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన హైదరాబాద్‌ ముచ్చట సమావేశానికి హాజరైన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. సీఏం స్థాయిలో వున్నప్పుడు నిష్పక్షపాతంగా అన్ని ప్రాంతాల ఆకాంక్షను గుర్తించి గౌరవించాల్సి వుంటుందన్నారు. పదవికి వుండే విలువలకు విరుద్ధంగా సీఎం కిరణ్‌ సాగుతున్నారని తెలిపారు. తిరుపతిలోని అలిపిరిలో సీని యర్‌ కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమం తరావు, గుంటూరు, ఇతర ప్రాంతాల్లో తెలంగాణ ఉద్యో గులు, అధికారులపై దాడులు అప్రజాస్వామికమని అన్నా రు. తెలంగాణ ప్రజలంతా సమన్వయంతో గాంధేయవా దంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నేటి నుంచి 25వ తేదీ వరకు వారం రోజుల పాటు హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద శాంతి దీక్షలు చేపడతున్నామని కోదండరామ్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వేళ అడ్డు తగిలి చరిత్ర హీనులుగా మిగలొద్దని సీమాంధ్ర ప్రాంత నేతలకు సూచించారు. కేవలం పదిశాతం మంది ప్రజలతో కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తూ అక్కడేదో జరిగిపోతున్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కిరణ్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు తమ వైఖరి మార్చుకొని తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. సీఎం ఇంకా సీమాంధ్రలో ఉద్యమాలను రెచ్చగొట్టాలని చూస్తే అందుకు పర్యవసానాలు కూడా చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.