రూపాయి పతనం ఆల్‌టైం రికార్డు


న్యూఢిల్లీ, ఆగస్టు 20 (జనంసాక్షి) :
భారత ఆర్థిక రంగ చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయికి రూపాయి పతనమైంది. సోమవారం ఉదయం డాలర్‌తో రూపాయి మారకం విలువ 1.48 రూపాయలు పడిపోయి భారీ పతనాన్ని చవిచూసింది. మొట్టమొదటి సారిగా 63 రూపాయల దిగువకు రూపాయి పతనమైంది. ఒక దశలో 63.30 పైసలకు పడిపోయిన రూపాయి 63.13 వద్ద నిలిచింది. సోమవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 62.30 పైసలకు చేరుకోగా సోమవారం మరో రూపాయి వరకు క్షీణించింది. ఉదయం 62.40 వద్ద ప్రారంభమైన రూపాయి  ట్రేడింగ్‌ భారీ నష్టాన్ని మూటగట్టుకుంది. రూపాయి భారీ పతనంతో స్టాక్‌ మార్కెట్లు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్‌ 450 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ వంద పాయింట్లకు పైగా కోల్పోయింది. రూపాయి పతనాన్ని నిరోధించే దిశగా విదేశాల్లో భారతీయ సంస్థల పెట్టుబుడులపై నియంత్రణలు, భారత్‌లో ఎన్నారైల పెట్టుబడులకు ఊతమిచ్చేలా పలుచర్యలను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించింది. అయితే ఈ చర్యలు ఆశించిన ఫలితాన్ని ఇస్తున్నట్లు కనిపించడం లేదు. తాజా పరిణామంతో చెల్లింపుల సంక్షోభ పరిస్థితి తలెత్తవచ్చనే భయం వ్యక్తమవుతోంది. 1991 నాటి సంక్షోభం ఉత్పన్నం కాదని ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ ప్రకటించినప్పటికీ నిపుణులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. మరోపక్క భారత స్టాక్‌ మార్కెట్‌ సోమవారం ఉదయం నష్టాలతో కావడంతో మధుపరులలో గుబులు పుట్టింది. చివర్లో సెన్సెక్స్‌ కాస్త కోలుకొని 18307.52 పాయింట్ల వద్ద నిలిచింది.