అమెరికాలో అన్నాకు నీరా’జనాలు’


న్యూయార్క్‌, ఆగస్టు 20 (జనంసాక్షి) :
అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజరేకు అమెరికా ప్రజలను నీరా’జనాలు’ పలికారు. అన్నా హజారే జిందాబాద్‌… అవినీతి డౌన్‌డౌన్‌.. అన్న నినాదాలతో న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌ వీధులు హోరెత్తాయి. సోమవారం సామాజికవేత్త అన్నాహజారే, బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నేతృత్యంలో భారతీయ దినోత్సవ పరేడ్‌ అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు 2 లక్షల మంది త్రివర్ణ పతాకాలు చేతపట్టుకొని ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భారతీయ సంఘాల సమాఖ్య ఏర్పాటు చేసిన వార్షిక భారతీయ దినోత్సవ సంబరాలకు భారతీయ అమెరికన్ల నుంచి విశేష స్పందన లభించింది. వాహనంలో ర్యాలీగా వెళుతున్న హజారేతో కరచాలనం చేసేందుకు చాలామంది పోటీపడ్డారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఆయనతో కలిసి వస్తామని ప్రతినబూనారు. ఈ సందర్భంగా చాలామంది కాషాయం, ఆకుపచ్చ, తెలుపు దుస్తులు ధరించి.. గాంధీ టోపీలు పెట్టుకొని తాము అన్నా వెంటేనని నినదించారు. భారీగా పోగైన జనాన్ని నియంత్రించడంలో న్యూయార్క్‌ పోలీసులకు ముచ్చెమటలు తప్పలేదు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఐఏ అధ్యక్షుడు సంజయ్‌ అమిన్‌, న్యూయార్క్‌ కాన్సుల్‌ జనరల్‌ జ్ఞానేశ్వర్‌ మూలే, మాజీ సైన్యాధిపతి వీకే సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి హృదయానికి హత్తుకునే సన్నివేశాన్ని గతంలో తాను ఎప్పుడూ చూడలేదని ఈ పరేడ్‌కు గ్రాండ్‌ మార్షల్‌గా వ్యవహరించిన విద్యాబాలన్‌ పేర్కొన్నారు. ఎఫ్‌ఐఏ పరేడ్‌ వేడుకల్లో తమిళ నటుడు శరత్‌కుమార్‌, రాధిక దంపతులు కూడా పాల్గొన్నారు. హజారే పాల్గొనడం వల్ల ఈసారి పరేడ్‌కు విశేష స్పందన లభించిందని నిర్వాహకులు పేర్కొన్నారు.