తెలంగాణ ప్రక్రియ కొనసాగుతోంది


అభ్యంతరాల పరిశీలనకే ఆంటోనీ కమిటీ
కమిటీ హైదరాబాద్‌కు రాదు
కమిటీని కలిసిన టీ కాంగ్రెస్‌ నేతలు
న్యూఢిల్లీ, ఆగస్టు 19 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రక్రియ కొనసాగుతోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తలెత్తే సమస్యల పరిష్కారానికే ఆంటోనీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. సోమవారం రాత్రి 8 గంటలకు తెలంగాణ ప్రాంత నేతలు, మంత్రులు ఆంటోనీ కమిటీతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం దిగ్విజయ్‌సింగ్‌  మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ నేతలతో హైదరాబాద్‌లో సమావేశం కావాలనున్నప్పటికీ పార్లమెంట్‌ సమావేశాల దృష్ట్యా దేశ రాజధానిలో సమావేశమైనట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై గానీ, విభజన ప్రక్రియలో ఏదేని అనుమానులన్నా ఆ కమిటీని సంప్రదించి తమ అభిప్రాయాలు తెలియజేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా వివరించారు. సీమాంధ్ర వాసులు గానీ, తెలంగాణవాదులు కానీ ఈ విభజన ప్రక్రియలో భాగంగా తమకున్న అనుమానాలను కమిటీకి చెప్పుకోవచ్చని ఆయన సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతూ హైదరాబాద్‌ సహా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని యథాతథంగా అమలు చేయాలని కోరామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాను యథాతథంగా ఉంచాలని కోరినట్లు డెప్యూటీ స్పీకర్‌ మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. ఆంటోనీ కమిటీతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డీకే అరుణతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. సోమవారం ఉదయమే శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి వారు ఢిల్లీ బయల్దేరారు. ఢిల్లీ చేరిన అనంతరం, టీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఆంటోనీకి కమిటీ ఎదుట వినిపించాల్సిన వాదనలపై సమగ్రంగా చర్చించారు. సీమాంధ్ర నేతల ఒత్తిళ్లకు తలొగ్గి విభజనపై వెనుకడుగు వేయొద్దని, తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరాలని నిర్నయించారు. ఈమేరకు రాత్రి 8 గంటలకు కాంగ్రెస్‌ వార్‌ రూంలో జరిగే భేటీలో వాదనలు వినిపించేందుకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకున్నారు. అలాగే, కమిటీకి అందించేందుకు ఓ నివేదికను రూపొందించారు. సీమాంధ్ర నేతల అభ్యంతరాలు, సమస్యలపై స్పష్టత ఇస్తూ పలు అంశాలను ఇందులో చేర్చినట్లు సమాచారం.కాగా, సమైక్య వాణిని వినిపించేందుకు గాను సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పలువురు సోమవారం ఉదయం ఢిల్లీ బయల్దేరారు. మంగళవారం ఆంటోనీ కమిటీతో భేటీ కానున్న నేపథ్యంలో.. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలతో సమావేశం అయ్యేందుకు సోమవారమే ఢిల్లీ చేరుకున్నారు. కమిటీ ఎదుట ఏయే వాదనలు ఎవరెవరు వినిపించాలనే అంశంపై ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు.