సీమాంధ్రుల కుట్రను తిప్పికొడుదాం


కృత్రిమ ఉద్యమం నుంచి బయటపడండి
హైదరాబాద్‌లేని తెలంగాణ ఊహించలేం : కోదండరామ్‌
మా సహనానికి హద్దుంటది : దేవీప్రసాద్‌
హైదరాబాద్‌లో సద్భావన శాంతి దీక్ష ప్రారంభం
హైదరాబాద్‌, ఆగస్టు 19 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వేళ సీమాం ధ్రులు పన్నుతున్న కుట్రలను తిప్పికొడుదామని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చి హింసవైపునకు మళ్లించేందుకు కుట్ర జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద సద్భావన శాంతి దీక్షను ప్రారంభించి మాట్లాడారు. పన్నేండేళ్లుగా తాము శాంతి యుతంగా ఉద్యమాన్ని నడిపిస్తున్నామని, గమ్యాన్ని ముద్దాడే సమయంలో కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. ఇందుకు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర ఉద్యమం రాజ్యాంగ విరుద్ధమని ఆయన చెప్పారు. ఎవరైన హక్కుల కోసం పోరాడుతారని కానీ, ఇష్టం లేని కాపురం కోసం ఉద్యమం చేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు. పదిజిల్లాలతో కూడిన హైదరాబాద్‌ రాష్ట్రం సాధించడమే తమ లక్ష్యమని కోదండరామ్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని నమ్మె పరిస్థితి లేదని, పార్లమెంట్‌లో  బిల్లు పాసయ్యే వరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సీమాంధ్రులు హైదరాబాద్‌పై కిరికిరి చేసేందుకు యత్నిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. అసలు హైదరాబాద్‌లేని తెలంగాణను ఊహించలేమని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టిన సీమాంధ్రులు ఎవరికైనా లాభాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని కృత్రిమ ఉద్యమంగా అభివర్ణించారు. అన్నదమ్ముల విడిపోదామని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో నివాసం ఉండే సీమాంధ్రులకు ఎలాంటి ఢోకా ఉండదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ లేని తెలంగాణను ఊహించలేమని, హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల రాష్ట్రం ఏర్పాటయ్యే దాకా రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యోగులు ఉద్యమం చేస్తే ఉక్కుపాదం మోపిన ప్రభుత్వం సీమాంధ్ర ఉద్యోగుల విషయమై చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు పాతుకుపోయారని, ఇటీవల జరుగుతున్న పరిణామాలే నిదర్శనమని చెప్పారు. మరోనేత శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ రాజ్యాంగం నిబంధల ప్రకారమే విభజన ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. సీమాంధ్ర ఉద్యోగులు అనవసరంగా రెచ్చగొట్టవద్దని ఆయన హితవు పలికారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కె. తారకరామారావు మాట్లాడుతూ ఆంధ్రాబాబులందరూ కలసి తెలంగాణను అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. కిరణ్‌, చంద్రబాబు, వైఎస్‌ జగన్‌లు ఆంధ్రాబాబులేనని చెబుతూ.. సమైక్యాంధ్ర ఉద్యమం వెనుక ఈ ముగ్గురి హస్తం ఉందని ఆరోపించారు. సీఎం క్యాంపు కార్యాలయం కేంద్రంగా తెలంగాణ వ్యతిరేక కుట్ర జరుగుతోందని కేటీఆర్‌ విమర్శించారు. అభ్రదతా భావంతో సీఎం వద్దకు వెళ్లిన ఏపీఎన్జీవోలను కిరణ్‌కుమార్‌రెడ్డి రెచ్చగొట్టి పంపించారని ఆయన ఆరోపించారు. సీఎంను కలిసిన తర్వాతే వారు జై సమైక్యాంధ్ర అంటూ స్వరం పెంచారని కేటీఆర్‌ వివరించారు. ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ములుగా కలిసి ఉందామని ఆయన కోరారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విడిపోతే రెండు ప్రాంతాలు అభివృద్ది చెందుతామయని స్పష్టం చేశారు. మాకు దక్కనిది మీకు దక్కకూడదన్న ధోరణి సీమాంధ్ర నేతలో కనబడుతోందని ఆయన విమర్శించారు. ఈ ధోరణి విడనాడాలని ఆయన సూచించారు. లేకపోతే జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కేటీఆర్‌ హెచ్చరించారు. బీజేపీ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రక్రియపై జాప్యం చేస్తే సహించమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్త చుక్కా రామయ్య, న్యూ డెమోక్రసీ నేత సూర్యం తదితరులు ప్రసంగించారు.