బీహార్‌లో ఘోరం జనంపైకి దూసుకెళ్లిన రైలు


37 మంది దుర్మరణం
డ్రైవర్‌ను చితకబాది, బోగీలకు నిప్పుపెట్టిన స్థానికులు
పాట్నా, ఆగస్టు 19 (జనంసాక్షి) :
బీహార్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన రైలు యాత్రికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 37 మంది దుర్మరణం చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకా శముంది. సహార్సా నుంచి పాట్నా వెళ్లే రాజ్యామణి ఎక్స్‌ప్రెస్‌ ఈ దుర్గటనకు కారణమైంది. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన స్థానికులు రైలు డ్రైవర్‌ను చితకబాది, బోగీలకు నిప్పు పెట్టారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉంది. బీహార్‌లోని ధమారా ఘాట్‌లోని కాత్యాయని ఆలయంలో నెల రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు సోమవారంతో ముగిసాయి. చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చారు. ఈనేపథ్యంలో కొంత మంది శివ భక్తులు సోమవారం తెల్లవారుజామున ధమారాఘాట్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో పట్టాలు దాటుతున్నారు. అదే సమయంలో 80 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చిన రాజ్యామణి ఎక్స్‌ప్రెస్‌ వారి పైనుంచి దూసుకెళ్లింది. అనంతరం కొంత దూరం వరకు వెళ్లి రైలు ఆగిపోయింది. ఘటన స్థలంలోనే 28 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు రైల్వే పరిధిలోని సమస్తిపూర్‌ డివిజన్‌లో చోటు చేసుకున్న ఈ దుర్ఘటనతో ఆగ్రహం చెందిన స్థానికులు రైలు డ్రైవర్‌ను కిందకు లాగి చితకబాదారు. ప్రయాణికులను దించేసి, కొన్ని బోగీలకు నిప్పు పెట్టారు. కొంత మంది యువకులు రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న మరో రెండు రైళ్లకు చెందిన కిటికీలను ధ్వంసం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. శివ భక్తులు పట్టాలు దాటుతుండగా, రైలు వారి పైనుంచి దూసుకెళ్లిందని ఎంపీ దినేశ్‌ చంద్రయాదవ్‌ తెలిపారు. పలువురు మృతి చెందగా, కొంత మంది తీవ్రంగా గాయపడ్డారని వారిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని వివరించారు. రాజ్యమణి ఎక్స్‌ప్రెస్‌కు ధమారా రైల్వే స్టేషన్‌లో హాల్ట్‌ సదుపాయం లేదని రైల్వే అధికారులు తెలిపారు. అయితే, రైలును ఆపేందుకు కొందరు ప్రయాణికులు పట్టాలపైకి యత్నించినట్లు చెప్పారు