రాజకీయ లబ్ధి కోసమే విజయమ్మ నాటకాలు


విపక్షాలదీ ఇదే తీరు
2008లో ప్రణబ్‌ కమిటీకి లెటరెలా ఇచ్చావ్‌
తెలంగాణ తీర్మానం ప్రవేశ పెట్టమని ఎందుకు చెప్పావ్‌ : బొత్స
హైదరాబాద్‌, ఆగస్టు 20 (జనంసాక్షి) :
రాష్ట్ర విభజన అంశంపై రాజకీయ పార్టీలు నాటకాలాడుతున్నాయని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటికీ ఏ పార్టీ కూడా సమైక్యమనడం లేదని అన్నారు. ఇప్పుడు విభజన వద్దంటున్న వారు అఖిలపక్ష సమావే శంలో సానుకూలంగా ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. పార్టీ మనుగడ కోసం ఇలాంటి రాజకీ యాలు చేస్తున్నారని విమర్శించారు. కొందరు సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు మినహా ఎవరూ సమైక్యమని అనడం లేదని వివరించారు. మంగళవారం బొత్స విూడియాతో మాట్లాడారు. అన్ని పార్టీల ఏకాభిప్రాయం తీసుకున్న తర్వాతే కాంగ్రెస్‌ అధిష్టానం తెలంగాణపై నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణకు అనుకూలంగా 2008లో ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చిన టీడీపీ.. మళ్లీ సమైక్యమంటుందని విమర్శించారు. 2009 ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ అంశం పెట్టి, తెలంగాణకు అనుకూలమని చెప్పి, బిల్లు పెట్టకపోతే మెడలు వంచి బిల్లు పెట్టిస్తామన్న టీడీపీ ఇప్పుడు మాటెందుకు మారుస్తోందని ప్రశ్నించారు. అభిప్రాయం కోసం ప్రజల్లోకి వెళ్తానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. లేఖ ఇచ్చేటప్పుడు ప్రజల అభిప్రాయం అడగకుండా ఇప్పుడెలా అడుగుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ మెడలు వంచి తీర్మానం పెట్టిస్తామన్న బాబు మాటెందుకు మార్చారని నిలదీశారు. సున్నిత అంశాలను అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం సరికాదన్నారు. అన్ని పార్టీలు అభిప్రాయం చెప్పాకే తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుందని, సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు మాత్రమే సమైక్యానికి కట్టుబడి ఉన్నారన్నారు. రాజకీయ మనుగడ కోసమే వైఎస్సార్‌సీపీ ఆరాటపడుతోందని బొత్స మండిపడ్డారు. సమన్యాయం పేరుతో ఊసరవెల్లిలా డ్రామాలాడుతోందని నిప్పులు చెరిగారు. రాష్టాన్న్రి సమైక్యాంగా ఉంచాలంటూ విజయమ్మ చేస్తున్న దీక్ష వీధి నాటకాన్ని తలపిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనపై అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్‌సీపీ సానుకూలంగా మాట్లాడడంతోనే కాంగ్రెస్‌ విభజనకు అనుకూలంగా నిర్నయం తీసుకుందన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే వైఎస్సార్‌సీపీ నేతలు ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని ఆరోపించారు.