సమస్యలు పరిష్కరించి రాష్ట్రాన్ని విభజించండి ఆంటోనీతో సీఎం


న్యూఢిల్లీ, ఆగస్టు 20(జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటు వల్ల తలెత్తే సమస్యలు పరిష్కరించి రాష్ట్రాన్ని విభజించాలని ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆంటోనీ కమి టీని కోరారు. ఆంటోనీ కమిటీతో ఆయన మంగళవారం సాయంత్రం నలభై నిమిషాల పాటు భేటీ అయ్యారు. జలవనరులు, విద్యుత్తు, ఉపాధి, నక్సలిజం, హైదరాబాద్‌ విషయాల్లో తలెత్తే సమ స్యలను ఆయన వివరిం చారు. విభజన జరిగితే ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగి నీటి యుద్ధాలు జరుగుతాయని కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆంటోనీ కమిటీకి చెప్పినట్లు సమా చారం. రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రం ఐక్యంగానే ఉండాలని ఆయన సూచించారు. ఒక డ్యామ్‌ను రెండు రాష్ట్రాలు పంచుకోవాల్సి వస్తుందని ఆయన చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జలవనరుల పంపిణీ చేయాల్సి వుంటుందని ఆయన చెప్పారు. విభజన రెండు ప్రాంతాలకు కూడా నష్టమేనని చెప్పారు. రాష్ట్ర విభజనపై పునరాలోచన చేయాలని ఆయన సూచించారు. నిఘా వర్గాల హెచ్చరికలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అయితే, రాష్ట్ర విభజనపై నిర్ణయం జరిగిపోయిందని, వెనక్కి వెళ్లలేమని ఆంటోనీ కిరణ్‌కుమార్‌రెడ్డితో చెప్పినట్లు సమాచారం. వివిధ అంశాలపై సీమాంధ్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. దీంతో సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేయాలి. అంతకుముందు కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌తో సమావేశమయ్యారు. బుధవారం కిరణ్‌కుమార్‌రెడ్డి  కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసే అవకాశం వుంది. కాగా, ఆంటోనీ కమిటీ ముందు సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు, సమైక్యవాదాన్ని వినిపించారు. సమైక్యంగానే వుంచాలని తాము కోరినట్లు ఆంటోనీ కమిటీతో భేటీ అనంతరం మంత్రి శైలజానాథ్‌ మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాయలసీమ, ఆంధ్ర, హైదరాబాద్‌ ప్రాంతాల ప్రజలు సమైక్యాన్ని కోరుకుంటున్నట్లు తాము చెప్పినట్లు ఆయన తెలిపారు. విభజన జరిగితే ఇంతకన్నా పెద్ద సమస్యలు తలెత్తుతాయని చెప్పినట్లు తెలిపారు. నదీజలాలు, ఉపాధి కల్పన, ఆర్ధికాభివృద్ది తదితర విషయాల్లో ఇరు ప్రాంతాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని వివరించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రానికి రావాలని ఆంటోనీ కమిటీని కోరినట్లు ఆయతన తెలిపారు. విభజన వల్ల తలెత్తే సమస్యలను తాము వివరించినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌ పైనా చర్చించామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో సీమాంధ్రులకు రక్షణ వుండదని చెప్పినట్లు ఆయన తెలిపారు. తాము చెప్పిన విషయాలను సావధానంగా విన్నారని, రాష్ట్రంలో పర్యటించాలని ఆంటోనీ కమిటీని కోరామని ఆయన తెలిపారు. రాయలసీమ నీటి సమస్యను ఎలా పరిష్కరిస్తామని తాము అడిగినట్టు మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి చెప్పారు. రాయలసీమ ఎడారిగా మారుతుందని చెప్పినట్లు ఆయన తెలిపారు. రాయల తెలంగాణ ప్రస్తావన రాలేదని ఆయన చెప్పారు. పార్టీ నిర్ణయమే కాబట్టి విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరినట్లు మంత్రి రామచంద్రయ్య తెలిపారు. సీమాంధ్ర నాయకులు దాదాపు రెండు గంటల పాటు ఆంటోనీ కమిటీ సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సంకిష్ట పరిస్థితిన ఎదుర్కుంటున్నారని కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇంఛార్జీ దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. సీమాంధ్ర నేతలతో ఆంటోనీ కమిటీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 26, 27, 28, తేదీల్లో మళ్లీ సమావేశమవుతామని ఆయన చెప్పారు. సీమాంధ్ర నేతల అభిప్రాయాలను తాము సావధానంగా విన్నట్లు ఆయన తెలిపారు.