విభజిస్తే అన్ని కష్టాలే.. మేం అడుక్కుతింటాం


ఆంటోనీ కమిటీతో సీమాంధ్రులు
న్యూఢిల్లీ, ఆగస్టు 20 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగితే అన్నీ కష్టాలేనని సీమాంధ్రులు ఆంటోనీ కమిటీకి మొరపెట్టుకున్నారు. మంగళవారం రాత్రి కాంగ్రెస్‌ వార్‌ రూంలో వారు ఆంటోనీ కమిటీతో భేటీ అయ్యారు. తెలంగాణ ఏర్పాటుతో తాము అడుక్కుతినే పరిస్థితులు ఎదురవుతాయని కమిటీకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సమావేశం అనంతరం మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగితే నీటి సమస్యలు ఎలా  పరిష్కరిస్తారని ఆంటోనీ కమిటీని ప్రశ్నించారు. విభజన జరిగితే రాయలసీమ ఎడారిగా మారిపోతుందని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కమిటీని కోరినట్లు చెప్పారు. రాష్ట్ర విభజన కంటే ముందు హైదరాబాద్‌ సమస్యను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆంటోనీ కమిటీని కోరినట్లు మరో మంత్రి శైలజానాథ్‌ చెప్పారు. ఇప్పుడిప్పుడే బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని, ఇలాంటి సమయంలో విభజన మంచిది కాదని కమిటీకి వివరించామన్నారు. గంటన్నర పాటు సాగిన భేటీలో వారు సీమాంధ్రలో తలెత్తే ఇబ్బందులపై ఏకరువు పెట్టడం తప్ప వారి నుంచి ఎలాంటి హామీ లభించనట్టు సమాచారం.