కుటుంబ తగాదాలకు రాజకీయ రంగు


ఊడిపోయే ముక్కుకు రాజీనామా హంగు
హరికృష్ణ కామెడీ
హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి) :
పట్టుమని మరో ఆరు నెలలకు మించి ఉం డలేని పదవిని పట్టు కుని రాజీనామా చేస్తు న్నట్లు, దీనిని కేవలం రాష్ట్రాన్ని విడగొట్టినం దుకే అన్నట్లుగా బిల్డప్‌ ఇచ్చేందుకు నందమూరి హరికృష్ణ ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తెలుగుదేశం పార్టీలో ఇమడలేక గత ఏడాదిన్నరగా కుడితిలో పడ్డ ఎలుకగా గిలగిలా కొట్టుకుంటున్న నందమూరి హరికృష్ణ తనకున్న పదవిని సమైక్యాంధ్ర బూచి చూపి  రాజీనామా అస్త్రం సందించారు. కేవలం ఆరు నెలల ముందుగా తన రాజ్యసభ సభ్యత్వానికి హరికృష్ణ కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలోని రాజ్యసభలో చైర్మన్‌ హమీద్‌ అన్సారీకి స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా సమర్పించారు. పైకి మాత్రం తాను రాష్టాన్న్రి విడగొట్టడం వల్లే కలత చెంది రాజీనామా చేస్తున్ననని ప్రకటించడం విడ్డూరం. ఇదే హరికృష్ణ తెలంగాణ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు కూడా చెప్పిన విషయం మాత్రం ప్రజలు మరిచిపోయి ఉండరనేది వాస్తవం. కాంగ్రెస్‌కు కూడా దన్యవాదాలు ఆనాడు చెప్పేశారు. ఆతర్వాత నాలుగు రోజులకు కళ్లుతెరిచిన నందమూరి వంశ వారసుడు హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద రాజీనామా చేస్తున్నట్లు ఓలేఖపై సంతకాలు చేసి రాజ్యసభకు ఫ్యాక్స్‌ కూడా చేసేశారు. అయితే ఆతర్వాత ప్రారంభమైన రాజ్యసభ సమావేశాల్లో నిత్యం పాల్గొంటూనే వచ్చారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తన వాణి వినిపించేందుకు ప్రయత్నం చేస్తూ వచ్చారు. నిన్నటికి నిన్న బాలకృష్ణ ఇంట్లో వివాహానికి కూడా ఆయన గైర్హాజరు కావడంతో పార్టీలో పెద్దఎత్తున చర్చనీయాంశంగా కూడా మారింది. తెలుగుదేశంపార్టీలో పైచేయి సాధించే అవకాశాలు జూనియర్‌ ఎన్టీఆర్‌కు అధికంగా ఉండడంతో తన ఉనికికే ప్రమాదం వస్తుందని గుర్తించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జూనియర్‌ను ప్రక్కన పెడుతూనే వస్తున్నాడు. దీనికి తోడు జూనియర్‌ ఎన్టీఆర్‌కు మంచి మిత్రుడిగా ఉన్న ఆళ్లనాని టిడిపికి గుడ్‌బై చెప్పి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోకి మారడం ఆయన ఫ్లెక్సీల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌కు, ఎన్టీఆర్‌కు చెందిన ఫోటోలు పెట్టడంతో బాబుకు, ఆయన వియ్యంకుడైన బాలకృష్ణకు కూడా ఆగ్రహం తెప్పించాయి. దీంతో వివాదం కాస్తా చిలికిచిలికి గాలివానలా కూడా మారిపోయింది. బాలయ్య అన్న కుమారుడు జూనియర్‌ను తరిమి కొట్టండంటూ పిలుపు నివ్వడమేకాక పార్టీద్రోహిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఇలా కొనసాగుతున్న సమయంలోనే గత ఏడాది మహానాడు సమయంలోనే జూనియర్‌ స్థానంలో ఆయన కుమారుడు లోకేష్‌ను రాజకీయ ఆరంగేట్రం చేసేందుకు హరికృష్ణను, జూనియర్‌ ఎన్టీఆర్‌కు కనీసం స్థానం కూడా లేకుండా చేసేశారు బావబామ్మర్దులు. ఇలా తరచుగా హరికృష్ణను ఆయన కుమారుడైన జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఏకాకిని చేసేందుకు బాబు, బాలకృష్ణ అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూనే ఉన్నారు. ఇందులోబాగంగా బాలకృష్ణ తన చిన్న కూతురు తేజస్విని వివాహానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ను కనీసం మాట వరుసకైనా పిలువలేదనే పుకార్లు షికార్లుగా మారాయి. ఢిల్లీలో పార్లమెంట్‌ సమావేశాలు లేకపోయినా కూడా హరికృష్ణ మాత్రం తమ్ముడి కుమార్తె వివాహానికి గైర్హాజరయ్యారు. పార్టీకి బాలయ్య దూరం చేస్తున్నాడనే అక్కసుతోనే ఉన్న హరికృష్ణ ఆరునెలల పదవి ఉంటెంత లేకుంటే ఎంత అనే భావనతోనే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆరునెలల తర్వాత తిరిగి రాజ్యసభ సీటును బావాబామ్మర్దులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో రాజీనామా చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అయితే ఇది మాత్రం పొక్కకుండా ఉంచేందుకు ప్రయత్నించి నేడు జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని వంకగా చూపించి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటనలు గుప్పించి లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. వాస్తవం కుటుంబ కలహాలు, రాజకీయ భవిష్యత్‌ అందకారం అవుతుందనే భయం ఉండగా నేడు మాత్రం ఉద్యమాన్ని వాడుకునేందుకు హరికృష్ణ ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. తెలంగాణపై పార్టీ యూటర్న్‌ తీసుకున్నట్లుగానే హరికృష్ణ కూడా యూటర్న్‌ తీసుకోవడానికి కారణం కుటుంబ కారణమే అంటున్నారు. అయితే రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఎత్తుగడగా రాజీనామా ఆస్త్రాన్ని వినియోగించుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే మాత్రం టిడిపి గాని, హరికృష్ణగాని తెలంగాణ, సీమాంద్ర ప్రజలను మోసం చేసేందకు ప్రయత్నం చేస్తున్నారని మాత్రం చెప్పవచ్చు. కాగా హరికృష్ణ రాజీనామాను ఆమోదించిన విషయాన్ని డెప్యూటీ చైర్మన్‌ కురియన్‌ సభలో ప్రకటించారు. హరికృష్ణ తన రాజీనామా లేఖను అందజేశారని, అది ఆమోదించామని తెలిపారు. ఈ రోజు నుంచే ఇది అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. రాజీనామా చేసిన అనంతరం హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజిస్తున్నందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఆందోళనలతో రాష్ట్రం భగ్గుమంటోందని, రాష్టాన్న్రి సమైక్యంగా ఉంచాల్సిందేనని డిమాండ్‌ చేశారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసినందుకు గర్వపడుతున్నానని తెలిపారు. ఎన్టీఆర్‌ వల్లే తనకీ పదవి దక్కిందని.. అన్నగారి ఆశయ సాధన కోసమే తాను పదవిని త్యజించినట్లు చెప్పారు. తనను రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించినందుకు హరికృష్ణ సభాపతికి ధన్యవాదాలు తెలిపారు. తాను  ప్రజల మనిషినని తండ్రి బాటలో నడుస్తానని ప్రకటించారు. రాష్ట్ర విభజనపై హరికృష్ణ వైఖరి ఇటీవల వివాదాస్పదమైంది.