జాతులు కాదు జాతీయతే ప్రధానం


రాజాబహద్దూర్‌ వెంకటరామారెడ్డి స్మారకోపన్యాసంలో
జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి) :
జాతులు కాదు జాతీయతే ప్రధానమని గోవా లోకాయుక్త, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి అన్నారు. తెలుగుజాతి, ఇంకో జాతి అనేవి ఉండవని దేశం మాత్రమే ఒకటని, దేశంలో జీవించే వారంతా భారతీయులేనని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో రాజాబహద్దూర్‌ కోత్వాల్‌ వెంకటరా మారెడ్డి 145వ జయంతి సందర్భంగా గురువారం పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో ఆయన ‘తెలంగాణ రాష్ట్రం-భారత రాజ్యాంగ ప్రక్రియ’ అనే అంశంపై ప్రసంగించారు. తెలుగుజాతి ఐక్యంగా ఉండాలనే డిమాండే రాజ్యాంగ విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు తెలుగుజాతి మాట్లాడటమే రాజ్యాంగం ప్రకారం అవమానకరమని, ఆ మాటే అవమానకరమైన శబ్ద మని ఆయన అభివర్ణించారు. గతంలో తమిళ జాతికి ప్రత్యేక దేశం ఉండాలనే డిమాండ్‌ ఏమైందో గుర్తు చేసుకోవాలని అన్నారు. దేశమంతా ఒక్కటేనని, దేశంలో నివసించే పౌరులందరూ రాజ్యాంగం ప్రకారం సమానులని ఆయన తెలిపారు. అలా కాకుం డా తెలుగుజాతి పేరుతో ఒకే రాష్ట్రంలో ఉండాలని కోరికే అసంబద్ధమైనదని ఆయన పేర్కొన్నారు. దేశానికి దేశానికి మధ్య మాత్రమే యుద్ధాలు జరుగుతాయే తప్ప రాష్ట్రాల మధ్య కాదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రంలో యుద్ధవాతావరణం నెలకొన్నదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య సరిహద్దు వివాదం నెలకొంది కాబట్టి అక్కడ యుద్ధం జరిగితే జరగవచ్చని, కానీ అక్కడ కూడా యుద్ధవాతావరణం లేదని, అలాంటి రాష్ట్రంలో యుద్ధ వాతావరణం నెలకొంటుందా అని ఆయన ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలు సిగ్గుచేటని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగబోయేది రాష్ట్ర విభజనే తప్ప దేశ విభజన కాదని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుందని స్పష్టం చేశారు. రాజ్యాంగ మీద ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులు తెలుగుజాతి ఐక్యంగా ఉండాలని కోరడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. రాజ్యాంగంలోని 3వ అధికరణం ప్రకారం రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్‌కు ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే సీమాంధ్ర ప్రాంతీయులు చెప్తున్నట్లుగా భాషా ప్రయోక్త రాష్ట్రమనేదే రాజ్యాంగంలో లేదని తేల్చిచెప్పారు. కొత్త రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభలో తీర్మానంతో పనిలేదని అన్నారు. శాసనసభ ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా రాజ్యాంగంలోని 3వ అధికరణం కింద పార్లమెంట్‌ కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులకు ఆ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం లేదని తేల్చిచెప్పారు. పార్లమెంట్‌ చేసే చట్టాన్ని అందరూ ఆమోదించి తీరాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలసంఘం రిటైర్డ్‌ సీఈ ఆర్‌. విద్యాసాగర్‌రావు, విద్యుత్‌ జేఏసీ చైర్మన్‌ రఘు, జలంధర్‌ తదితరులు పాల్గొన్నారు.