ఫైళ్లమాయంపై పార్లమెంట్‌లో రభస


విపక్షాల ఒత్తిడికి తలొగ్గిన సర్కార్‌
ప్రధాని వివరణ ఇస్తారని ప్రకటన
సీమాంధ్ర సభ్యుల సస్పెన్షన్‌కు ప్రతిపాదన
సెప్టెంబర్‌ 5వరకు సమావేశాల పొడిగింపు
న్యూఢిల్లీ, ఆగస్టు 22 (జనంసాక్షి) :
బొగ్గు కుంభకోణంలో ఫైళ్ల గల్లంతు వ్యవహారం గురువారం కూడా పార్లమెంట్‌ను కుదిపేసింది. దాదాపు 257 ఫైళ్లు మాయమయ్యాయనే అనుమానాలపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ప్రకటన చేయాలని బీజేపీ ఉభయ సభలను స్తంభింపజేసింది. ప్రధాని మౌనం వీడే వరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేసింది. అయితే, కీలకమైన ఆహార భద్రత బిల్లుకు ఆమోదం పొందాలనే పట్టుదలతో ఉన్న కేంద్ర ప్రభుత్వం విపక్షాలను శాంతపరించేందుకు సిద్ధమైంది. ఫైళ్ల గల్లంతు వ్యవహారంపై ప్రధాని జోక్యం చేసుకొని వివరణ ఇస్తారని ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రకటించింది. అంతేకాకుండా ఆహార భద్రత బిల్లు, భూసేకరణ బిల్లులకు ఆమోదం పొందాలని భావిస్తున్న యూపీఏ వర్షాకాల సమావేశాలను మరో ఐదురోజులు పొడిగించింది. దీంతో సెప్టెంబర్‌ 5 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. కోల్‌గేట్‌కు సంబంధించిన ఫైళ్లు మాయం కావడంపై లోక్‌సభలో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగాయి. గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే.. బొగ్గు శాఖలో దస్త్రాలు గల్లంతు వ్యవహారంపై ప్రధాని సమాధానం చెప్పాలని బీజేపీ సభ్యులు సభను స్తంభింపజేశారు. ప్రధాని మౌనం వీడాలని నినాదాలు చేశారు. అయితే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనలు చేస్తున్నా.. ప్రధాని మాత్రం సభలో మౌనంగా కూర్చుండిపోయారు. అదే సమయంలో సీమాంధ్ర ఎంపీలు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన అనంతరం కూడా విపక్షాల ఆందోళన కొనసాగింది. ప్రధాని ప్రకటన చేయాలని పట్టుబట్టాయి. ప్రతిపక్షాల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గింది. ఫైళ్ల మాయంపై ప్రధాని జోక్యం చేసుకుంటారని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి కమల్‌నాథ్‌ సభలో ఓ ప్రకటన చేశారు. ఫైళ్ల గల్లంతుపై బొగ్గు శాఖ మంత్రి ప్రకటన చేసిన అనంతరం జరిగే చర్చ సందర్భంగా ప్రధాని జోక్యం చేసుకుంటారని తెలిపారు. ఈ వ్యవహారంలో దాయాల్సింది ఏమీ లేదని తెలిపారు. ‘బొగ్గు శాఖ మంత్రి ఓ ప్రకటన చేస్తారు. దానిపై చర్చ సందర్భంగా ప్రధాని వివరణ ఇస్తారని’ చెప్పారు. అయితే, ఆయన ప్రకటన చేస్తుండగానే, రాష్ట్ర విభజనపై సీమాంధ్రకు చెందిన టీడీపీ, కాంగ్రెస్‌ ఎంపీలు సభలో ఆందోళనకు దిగారు. టీడీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి, స్పీకర్‌ మైక్‌లను లాగేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కమల్‌నాథ్‌ 11 మంది ఎంపీలను సస్పెండ్‌ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. వారిని సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ విూరాకుమార్‌ ప్రకటించారు. అయితే, ఈ సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది. సస్పెన్షన్‌ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. సస్పెన్షన్‌ను తాము వ్యతిరేకిస్తున్నామని ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌ తెలిపారు. లోక్‌సభలో నెలకొన్న ప్రతిష్టంభనకు కాంగ్రెస్‌ పార్టీయే కారణమని మండిపడ్డారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ తప్పుడు ప్రక్రియలో తెలంగాణ అంశాన్ని చేపట్టిందన్నారు. కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ ముఖ్యమంత్రే వ్యతిరేకిస్తున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. విభజన తీరు అందరినీ బాధిస్తున్నందువల్లే ఇంత రాద్దాంతం జరుగుతోందని చెప్పారు. విభజన విషయంలో సొంత పార్టీలోనే కాంగ్రెస్‌ ఏకాభిప్రాయం తీసుకురాలేక పోయిందని ఎద్దేవా చేశారు. తమ హయాంలో మూడు రాష్టాల్రు ఏర్పాటు చేసినా.. ఎక్కడా కూడా ఎలాంటి గొడవలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. తెలంగాణపై కాంగ్రెస్‌ అనుసరించిన వైఖరి వల్లే పార్లమెంట్‌ నడవని దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. సభ సజావుగా సాగేలా చొరవ తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. 11 మంది ఎంపీల సస్పెన్షన్‌ను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. సస్పెన్షన్‌ వ్యవహారంపై టీడీపీ, కాంగ్రెస్‌ ఎంపీలు సభలో దుమారం సృష్టించడంతో స్పీకర్‌ సభను అరగంట వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన అనంతరం కూడా ఆందోళన కొనసాగడంతో సభ శుక్రవారానికి వాయిదా పడింది. ఫైళ్ల గల్లంతుపై అటు రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. దస్త్రాల గల్లంతుపై ప్రధాని సమాధానం చెప్పాలని ఆందోళనకు దిగడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. దీంతో కేంద్ర మంత్రి రాజీవ్‌శుక్లా సభలో ఓ ప్రకటన చేశారు. ఫైళ్ల గల్లంతుపై ప్రధాని జోక్యం చేసుకుంటారని హావిూ ఇచ్చారు. కాగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు తుడిచిపెట్టుకుపోవడంతో సమావేశాలు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 31 వరకు సమావేశాలు కొనసాగనుండగా.. మరో ఐదు రోజులు పొడిగించింది. దీంతో సెప్టెంబర్‌ 5 వరకు వర్షాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. పార్లమెంట్‌లో ఆందోళనకు దిగిన సీమాంధ్ర ఎంపీలు నానా రభస సృష్టించారు. టీడీపీ ఎంపీలు స్పీకర్‌ మైక్‌లను తోసేశారు. ఈ నేపథ్యంలో ఏడుగురు కాంగ్రెస్‌, నలుగురు టీడీపీ ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు వేయాలని కోరుతూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారని పదకొండు మందిపై సస్పెన్షన్‌ వేటు వేస్తు ప్రతిపాదించిన తీర్మానంపై స్పీకర్‌ మీరాకుమార్‌ ఓటింగ్‌ చేపట్టారు. అయితే 11 మంది సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్‌ వేటు నిర్ణయాన్ని సుష్మాస్వరాజ్‌ వ్యతిరేకించడంతో సభలో గందరగోళం నెలకొంది. ఓటింగ్‌లో ఎవరూ పాల్గొనకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్‌ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. అయితే, సీమాంధ్ర ఎంపీలపై సస్పెండ్‌ వేటు వేసినట్లు స్పీకర్‌ ప్రకటించినప్పటికీ, ఓటింగ్‌ జరగకపోవడంతో దానిపై సందిగ్ధత నెలకొంది. కాగా, సస్పెన్షన్‌ వేటు పడుతుందని ముందే గ్రహించిన కనుమూరి బాపిరాజు సభ మధ్యలోంచి వెళ్లిపోయారు. సస్పెన్షన్‌ సమయానికి బొత్స ఝాన్సీ సభలో లేరు. ఆమె సభకు ఆలస్యంగా వచ్చారు. ఎంపీలు సబ్బంహరి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, చింతా మోహన్‌ సభకు హాజరు కాలేదు. అయితే, సభకు రాని రాయపాటి సాంబశివరావు పేరును కూడా కమల్‌నాథ్‌ సస్పెన్షన్‌ లిస్టులో చేర్చడం విశేషం.