ఓ పార్టీ నిర్ణయంపై సమ్మె చేస్తారా?


సమ్మెలో ఎంతమంది ఉన్నారో శ్వేతపత్రం ప్రకటించండి
టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌
హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి) :
ఓ పార్టీ నిర్ణయంపై ఎవరైనా సమ్మె చేస్తారా అని టీఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్‌ ప్రశ్నించారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూసినా ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయా లకు వ్యతిరేకంగా సమ్మెలు చేసిన సంఘట నలున్నాయని, అయితే ఏపిఎన్జీఓలు మాత్రం కాంగ్రెస్‌ పార్టీ సీడబ్ల్యూసీ తీర్మానానికి వ్యతిరేకంగా సమ్మె చేసి రికార్డు సృష్టించారని దేవీప్రసాద్‌ ఎద్దేవా చేశారు. సచివాలయంలో వివిధ ఉద్యోగ సంఘాలజేఎసి ఆవిర్భావం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఊహాజనితమైన ప్రకటనలకు స్పందించి ఉద్యమాలు చేయడం అనైతికమన్నారు.  తెలంగాణలో ఉద్యమం లేనేలేదని ఏపిఎన్జీఓల సంఘం అద్యక్షుడు అశోక్‌బాబు పేర్కొనడం దుర్మార్గమన్నారు. 60ఏళ్లుగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతూనే ఉందని వాస్తవాలను వక్రీకరించి ప్రజలను మోసం చేయాలని చూడడం ఉద్యోగ సంఘ ప్రతినిధిగా సరైంది కానేకాదన్నారు. తెలంగాణాలో ఉద్యమాలు, సకలజనుల సమ్మెల సమయంలో పూర్తిగా సహకరించిన అశోక్‌బాబు నేడు మాట మార్చి ఉన్మాదిలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికి కూడా సహకరించి విడిపోయేందుకు తనవంతు ప్రయత్నాలు చేయాలని ఆయన అశోక్‌బాబును కోరారు. అన్నదమ్ముల్లా ఇంతకాలం కలిసిమెలిసి ఉన్న ఉద్యోగులం అంతా నేడు విడిపోయే సమయంలో శత్రువుల్లా మారవద్దన్నారు. అలాంటి వాతావరణాన్ని సృష్టించొద్దన్నారు. మాటమార్చడం పార్టీలకు అలవాటుగా ఉంటుందని, ఉద్యోగులకు ఎంతకూ మంచిది కాదన్నారు. రాష్ట్రంలో ఏపిఎన్జీఓల సమ్మె కారణంగా నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారని చెప్పడం దౌర్బాగ్యమేనన్నారు. రాష్ట్రం మొత్తం విూద 5.89 లక్షల మంది ఉద్యోగులున్నారని ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌ సమయంలో వెల్లడించిందన్నారు. ఏపిఎన్జీఓల సమ్మె అపూర్వమైందని, చెప్పుకోవడం దయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుందన్నారు. ఇప్పటికింకా అధికారులు సమ్మెలోకి రానే లేదని, అనేక సెక్షన్ల ఉద్యోగులు కూడా రానేలేదన్నారు. అయినా కేంద్రాన్ని ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. అసలు రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదలచేయాలని దేవీప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. సీమాంధ్రలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ ఉద్యోగులు సమ్మెలో లేనే లేరని గుర్తుచేశారు. తెలంగాణాలో ఉద్యమం లేదని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర విభజనకు సహకరించాలని ఆయన మరోసారి కోరారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకునేందుకు కలిసి మెలిసి ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు తాము కూడా సిద్దంగా ఉన్నామన్నారు. తెలంగాణాలో అంతటా జెఎసిలు ఏర్పడ్డాయని, సచివాలయంలో తొలిసారిగా జేఏసీని గురువారమే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో టీ గెజిటెడ్‌ ఉద్యోగుల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, విఠల్‌ తదితరులు పాల్గొన్నారు.