సభను అడ్డుకుంటున్న సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్‌


స్పీకర్‌ విచక్షణాధికారం మేరకు నిర్ణయం
న్యూఢిల్లీ, ఆగస్టు 23 (జనంసాక్షి) :
పార్లమెంట్‌లో నిత్యం రగడ చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న సీమాంధ్ర ఎంపీలను శుక్రవారం స్పీకర్‌ మీరాకుమార్‌ సస్పెండ్‌ చేశారు. తనకున్న విచక్షణ అధికారాల మేరకు స్పీకర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. సభ్యుల సస్పెన్షన్‌పై ఓటింగ్‌ పెడితే మూకుమ్మడిగా వ్యతిరేకిస్తాయని విపక్షాలు హెచ్చరించిన నేపథ్యంలో ఆ తీర్మానం ఓడిపోతే యూపీఏ ప్రతిష్ట మసకబారుతుందనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్‌ ఈ ఎత్తుగడ వేసింది. స్పీకర్‌ విచక్షణాధికారంతో 12 మంది సీమాంధ్ర ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు వేయించింది. 11 మంది ఎంపీల సస్పెన్షన్‌ తీర్మానం సందిగ్ధంలో ఉండగా.. ఆ తీర్మానంతో సంబంధం లేకుండా స్పీకర్‌ 12 మంది సభ్యులను సస్పెండ్‌ చేశారు. శుక్రవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర సభ్యులు సభా కార్యకలాపాలకు అడ్డు తగిలారు. దీంతో సభ ఐదు నిమిషాలకే వాయిదా పడింది. మళ్లీ అవే ఆందోళనలు కొనసాగించారు. సమావేశాలను సజావుగా నడిపేందుకు సహకరించాలని స్పీకర్‌ మీరాకుమార్‌ కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ సభను గంట పాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన అనంతరం సీమాంధ్ర ఎంపీలు తమ నిరసనను కొనసాగించారు. వెల్‌లోకి దూసుకెళ్లి, సమైక్య నినాదాలు చేశారు. టీడీపీ, కాంగ్రెస్‌ సభ్యులు పోటాపోటీ నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభ మరో అరగంట పాటు వాయిదా పడింది. ఈ అరగంట వ్యవధిలో కాంగ్రెస్‌ తన వ్యూహానికి పదును పెట్టింది. సీమాంధ్ర ఎంపీలను సస్సెండ్‌ చేసేందుకు విపక్షాలు అంగీకరించకపోవడంతో ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని ఉపయోగించింది. వాయిదా అనంతరం తిరిగి సభ సమావేశం కాగానే, సీమాంధ్ర ఎంపీలు ఆందోళనలు కొనసాగించారు. దీంతో స్పీకర్‌ మీరాకుమార్‌ 12 మంది సభ్యులను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. సభా కార్యక్రమాలకు ప్రతిరోజూ ఆటంకం కలిగిస్తున్నారంటూ, ఆర్టికల్‌ 374 ఏ కింద తన విచాక్షణాధికారం మేరకు వారిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసే ఈ సస్పెన్షన్‌ అమలులో ఉంటుందని తెలిపారు. అనంతరం సభను తర్వాతి రోజుకు వాయిదా వేశారు. సభ వాయిదా పడినప్పటికీ టీడీపీ ఎంపీలు సభలోనే బైఠాయించారు. సీమాంధ్రకు న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేశారు.

ఫలించని స్పీకర్‌ యత్నాలు

అంతకుముందు పార్లమెంట్‌ సమావేవాలు సజావుగా నిర్వహించేందుకు స్పీకర్‌ మీరాకుమార్‌ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం ఏకాభిప్రాయం లేకుండానే ముగిసింది. తెలంగాణ అంశం, కోల్‌గేట్‌, ఇతరత్రా అంశాలపై కొద్దికాలంగా సభ దద్దరిల్లుతోంది. దీంతో మిగిలిన కొద్దిరోజులైనా సభను సజావుగా నడిపేందుకు అన్ని పార్టీలో స్పీకర్‌ మీరాకుమార్‌ సమావేశం ఏర్పాటు చేశారు. విభజన అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అయితే, సభను అడ్డుకుంటున్న సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్‌పై సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఎలాంటి నిర్ణంయం తీసుకోకూండగానే ముగిసింది. ఆ తర్వాత సమావేశమైన లోక్‌సభలో ఎలాంటి పరిస్థితి మార్పు రాలేదు. సభ్యుల ఆందోళనలతో గంటపాటు వాయిదా పడింది. దీంతో మరోమారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్‌పై విపక్షాలు మరోమారు అభ్యంతరం తెలిపింది. దీంతో భేటీలో ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ కొత్త ఎత్తుగడ వేసింది.
ఒకవైపు ఆందోళనలు.. మరోవైపు బిల్లులు
ఒకవైపు, సమైక్య రాష్ట్రం కొనసాగించాలని సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్‌, టీడీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగితే, మరోవైపు, అదే ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు సభలో బిల్లులు ప్రవేశపెట్టడం విశేషం. సీమాంధ్రకు న్యాయం చేయాలని టీడీపీ ఎంపీలు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కాంగ్రెస్‌ సబ్యులు నినాదాలు చేశారు. అదే సమయంలో, కేంద్ర మంత్రులు చిరంజీవి, పనబాక లక్ష్మి, జేడీ శీలం, కిషోర్‌ చంద్రదేవ్‌ సభలో పలు బిల్లులు ప్రవేశపెట్టారు.
కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అనంతవెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్‌, మాగుంట శ్రీనివాసులురెడ్డి, లగడపాటి రాజగోపాల్‌, హర్షకుమార్‌, ఉండవల్లి అరుణ్‌కుమార్‌, కనుమూరి బాపిరాజు, సబ్బం హరి, టీడీపీ ఎంపీలు నిమ్మల కిష్టప్ప, వేణుగోపాల్‌రెడ్డి, కొనకళ్ల నారాయణ, శివప్రసాద్‌.