ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టండి సుష్మాస్వరాజ్‌


న్యూఢిల్లీ, ఆగస్టు 24 (జనంసాక్షి) :
ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని బీజేపీ లోక్‌సభ పక్షనేత సుష్మాస్వరాజ్‌ కోరారు. ఇప్పుడు తెలంగాణ బిల్లు పెడితే మద్దతు ఇస్తామని స్పష్టంచేశారు. శనివారం ఆమె లోక్‌సభలో మాట్లాడుతూ, తెలంగాణపై బిల్లు పెడితే మద్దతు ఇస్తామని తాము ఎప్పటినుంచో చెబుతున్నామన్నారు. ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని కోరారు. అవసరమైతే లోక్‌సభ సమావేశాల గడువును పొడిగించాలన్నారు. బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు సమావేశాలను పొడిగించడం మంచి పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆడుతున్న నాటకాలవల్లే ఆంధ్రప్రదేశ్‌లో అనిశ్చితి నెలకొందన్నారు. పాలన కొనసాగడం లేదన్నారు. ఎవరికి వారు రోడ్లపైకి చేరి నిరసనలు తెలియజేస్తున్నారన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో పెడితేనే ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులు సర్దుకుంటాయని అన్నారు. మరో ఎంపీ జయప్రద మాట్లాడుతూ, ముంబయి బాధితురాలికి న్యాయం చేకూర్చాలని కేంద్రాన్ని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. డిసెంబర్‌ 16 నిర్భయ ఉదంతాన్ని మరువకముందే ముంబయిలో తాజాగా ఫోటో జర్నలిస్టుపై పాశవిక చర్య జరగడం దురదృష్టకరమన్నారు. బాధితురాలి పేరుమీద కోటి రూపాయలు డిపాజిట్‌ చేసి ఆమె జీవితాన్ని చక్కదిద్దాలని కోరారు.