యూటీ అంటే నాలుక కోసేస్తం


తెలంగాణను ఏ శక్తీ ఆపలేదు : హరీశ్‌
హైదరాబాద్‌, ఆగస్టు 24 (జనంసాక్షి) :
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలంటే నాలకు కోసేస్తామని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఈ భూమి ఉన్న ఏ శక్తి ఆపలేదని ఆయన పేర్కొన్నారు.  శుక్రవారం గాంధీ ఆస్పత్రిలో తెలంగాణ డాక్టర్లు నిర్వహించిన శాంతి దీక్షలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రజలపై, ఉద్యమంపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర జిల్లాల్లో జరుగుతున్న ఆందోళనలకు, తెలంగాణలోని ఆందోళనకు మధ్య ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేపట్టాలని తలపెట్టిన తమ పార్టీ అధినేత కేసీఆర్‌ను దీక్షా వేదికకు చేరుకోకముందే అరెస్టు చేసి, వేరు జిల్లాలోని ఆస్పత్రికి తరలించారని.. అదే సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన దీక్షకు ప్రభుత్వం, పోలీసులే రక్షణ కల్పించారని ధ్వజమెత్తారు. ఎస్కార్టులు పెట్టి విజయమ్మను దీక్షలో కూర్చోబెట్టారని, పోలీసు రక్షణ కల్పించి దీక్షకు అనుమతిచ్చారని విమర్శించారు. సమైక్యాంద్ర ర్యాలీకు అనుమతి అవసరం లేదా? తెలంగాణలోని ర్యాలీలకు మాత్రమే అనుమతి అవసరమా? అని ప్రశ్నించారు. తెలంగాణ వాదులకు ఏ కార్యక్రమానికి అనుమతి ఇవ్వని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేశ్‌రెడ్డి సమైక్యాంధ్ర ఆందోళనలకు ఎలా అనుమతిస్తారని నిలదీశారు. రాష్ట్రంలో సీమాంధ్రకో న్యాయం.. తెలంగాణకో న్యాయమా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అక్కడ దీక్షలకు అనుమతిచ్చి, ఉద్యమాలకు, ఉద్యమకారులకు సీఎం కిరణ్‌, డీజీపీ దినేశ్‌రెడ్డి బాసటగా నిలిస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ దీక్షలు చేస్తామంటే అనుమతులివ్వరు.. అక్రమంగా అరెస్టులు చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాము ఆందోళనలు చేస్తే తాలిబన్లు, నక్సలైట్లు అని అన్నారని, కేసీఆర్‌ను ముల్లా అని అన్నారని.. సీమాంధ్ర నాయకుల నోటిదురుసుతనానికి, సంస్కృతిని కించపరచడానికి నిదర్శనమన్నారు. ఇందిరాగాంధీని ఖలిస్తాన్‌ పొట్టన పెట్టుకుందని, రాజీవ్‌గాంధీని ఎల్టీటీఈ చంపిందని, సమైక్యాంధ్ర ఉద్యమం సోనియాగాంధీకి అదే గతి పట్టిస్తుందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ అన్నాడని, మానవబాంబులం అవుతామని అన్నాడని గుర్తు చేసిన హరీశ్‌.. అంటే ఉగ్రవాదులుగా మారి సోనియాగాంధీని చంపుతారా? అని ప్రశ్నించారు. చంపుతామనే వాళ్లు ఉగ్రవాదులా? ఆత్మబలిదానాలు చేసుకున్న తెలంగాణ యువకులు ఉగ్రవాదులా? అని సూటిగా నిలదీశారు. సీమాంధ్ర నాయకులు సహనాన్ని, విజ్ఞతను కోల్పోయారని మండిపడ్డారు. సీమాంధ్ర ఉద్యమానికి దశ, దిశ లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్పదని, అందుకు సీమాంధ్ర నేతలు సహకరించాలని కోరారు. రాష్ట్రాలుగా విడిపోయి అన్నదమ్ములుగా కలిసుందామని సూచించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో పాసయ్యేంత వరకూ మన పోరాటం శాంతియుతంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి చిరంజీవిపై హరీశ్‌ నిప్పులు చెరిగారు. చిరంజీవి మతి లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే సమన్యాయం ఎలా జరుగుతుందో చిరంజీవి చెప్పాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌పై కిరికిరి పెట్టొద్దని ఆయనకు హితవు పలికారు. హైదరాబాద్‌లో స్వేచ్ఛగా బతకండి.. కానీ యూటీ, వాటా కవాలంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరన్నారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణనే ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. తమ్ముడు బాలకృష్ణ కుమార్తె వివాహానికి హాజరు కాని హరికృష్ణ సమైక్యంగా ఉండాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని హరీశ్‌రావు మండిపడ్డారు. ఒకే కుటుంబం కలిసి ఉండలేనప్పుడు తాము ఎలా కలిసి ఉంటామని ప్రశ్నించారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని పదేపదే చెబుతున్న చంద్రబాబు హరికృష్ణ రాజీనామాపై వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.