మాగడ్డపై మీరెట్ల మీటింగ్‌ పెడతారు


– సీమాంధ్రుల న్యాయవాదుల సమావేశాన్ని అడ్డుకున్న తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ
హైదరాబాద్‌, ఆగస్టు 25(జనంసాక్షి):
తెలంగాణ నడి గడ్డ హైదరాబాద్‌లో సీమాంధ్ర న్యాయవాదులు సమావేశం ఏర్పాటు చేసుకోవడంపై తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ మండిపడింది. ఇంతకాలం దోచుకున్నది చాలక హైదరాబాద్‌లో వాటా అడుగుతారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజధాని నగరంలోని అబిడ్స్‌లో ఉన్న ఏపీఎన్జీవో కార్యాలయం ఆదివారం జై తెలంగాణ నినాదాలతో మారుమోగింది. సమైక్యాంధ్ర  భవిష్య కార్యాచరణపై చర్చించేందుకు సీమాంధ్ర ప్రాంత న్యాయవాదులు ఇక్కడ సమావేశం పెట్టుకోవద్దని సీమాంధ్రలోనే పెట్టుకోవాలని, విభజనను అడ్డుకోవద్దంటూ ఈ సమావేశంలోని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ సభ్యులు దూసుకెళ్లారు. పరస్పర నినాదాలతో తోపులాట నడుమ అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి న్యాయవాదులను శాంతింపజేశారు. ఆ సమయంలో అక్కడున్న ఏపీఎన్జీవోల సంఘం నేత అశోక్‌బాబు ‘టీ’ న్యాయవాదుల జేఏసీ తీరును తప్పుబట్టారు. తాము రాష్ట్ర విభజన నిర్ణయాన్ని పున:పరిశీలన చేయాలని కేంద్రంపై ఒత్తిడి  తెస్తున్నాం తప్ప తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదన్నారు. ఒక్కసారిగా దూసుకొచ్చిన తెలంగాణ వాదులను చూసి సీమాంధ్ర న్యాయవాదులు భీతిల్లారు. సీమాంధ్రాలో జై ఆంధ్ర సమావేశాలను అడ్డుకునే మీరా భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడేదని తెలగాణ వాదులు మండిపడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి తెలంగాణ అడ్వకేట్‌లను అరెస్టు చేశారు.