ఏపీఎన్‌జీవోల సమ్మె చట్టబద్ధం కాదు
రాజకీయ కారణాలతో ఎలా సమ్మె చేస్తారు
తక్షణం విరమించండి
హైకోర్టు సీరియస్
కౌంటర్‌కు గడువు కోరిన సీమాంధ్ర ఉద్యోగులు
విభజన పిటిషన్లు కొట్టివేత
హైదరాబాద్, ఆగస్టు 26 (జనంసాక్షి) :
ఏపీఎన్‌జీవోల సమ్మె చట్టబద్ధం కాదని, రాజకీయ కారణాలతో సమ్మె ఎలా చేస్తారని హైకోర్టు అక్షింతలు వేసింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమ్మె చేపట్టిన ఏపీఎన్జీవోల తీరుపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ కారణాలతో సమ్మె చేపట్టడం ఎంతవరకు సబబు అని గత విచారణ సందర్భంగా ఉద్యోగులకు మొట్టికాయలు వేసిన ధర్మాసనం సోమవారం మరోమారు అక్షింతలు వేసింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఏపీ ఎన్జీవోలు చేపట్టిన సమ్మె చట్టబద్ధం కాదని, దాన్ని తక్షణమే విరమించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ కేసీ భానులతో కూడిన ధర్మాసనం సోమవారం మరోమారు విచారించింది. కౌంటర్ దాఖలు చేయాలని గత విచారణ సందర్భంగా జారీ చేసిన ఆదేశాలను పాటించని ఏపీఎన్జీవోలు కౌంటర్ దాఖలు చేసేందుకు మరింత గడువు కోరారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ కేసీ భానులతో కూడిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించామని, మళ్లీ సమయం కావాలని కోరడమేమిటని ప్రశ్నించింది. శుక్రవారం వరకూ గడువివ్వవాలని, ఆలోగా కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ఎన్జీవోల తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ సందర్భంగా ఘాటైన వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ప్రతి పౌరుడూ తమ విధులను బాధ్యతతో నిర్వర్తించాలని హితవు పలికింది. గడువులోగా కౌంటర్ దాఖలు చేయని పక్షంలో చర్యలు తీసుకుంటామని ఏపీ ఎన్జీవోలను హెచ్చరించింది. రాజకీయాలతో తమకు సంబంధం లేదని, ప్రతి పౌరుడూ రాజ్యాంగబద్దుడై ఉండాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. సమ్మె చట్టబద్ధంగా జరుగుతుందా? న్యాయ విరుద్ధమా? అన్న దానినే పరిశీలనలోకి తీసుకుంటామని తెలిపింది. ఏపీ ఎన్జీవోల సమ్మెపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయడానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరి వెల్లడించాలని కోరుతూ.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి ఏపీఎన్జీవోలు సమ్మె బాట పట్టారు. ఈ నేపథ్యంలో వారి సమ్మె చట్ట విరుద్ధమంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఏపీ ఎన్జీవోలు చేపట్టిన సమ్మె అనైతికమని, తక్షణమే వారు సమ్మెను విరమించేలా ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాది రవికుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణ చేపట్టిన జస్టిస్ కల్యాణ్‌జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ కేసీ భానులతో కూడిన ధర్మాసనం గత వారం ఏపీఎన్జీవోలపై మండిపడింది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఏపీ ఎన్జీవోలు చేపట్టిన సమ్మెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి రాజకీయ ఉద్యమాల్లో ఎలా పాల్గొంటారని ప్రశ్నించింది. ‘విూరు ప్రైవేట్ ఉద్యోగులా? ప్రభుత్వ ఉద్యోగులా? సమ్మె రాజ్యాంగ విరుద్ధం. ఉద్యోగాలకు రాజీనామాలు చేసి సమ్మెలో పాల్గొనండి’ అని ఘాటైన వ్యాఖ్యలు చేసింది.
ప్రక్రియ మొదలు కాకుండా విచారణ ఎలా? : సుప్రీం
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్నయం తీసుకొనందున పిటిషన్ విచారణకు అనర్హమైనదని తెలిపింది. విభజన ప్రక్రియ మొదలు కాకుండా ఎలా విచారణ చేపడతామని ప్రశ్నించింది. రాష్ట్ర ఏర్పాటుకు, ప్రకటనకు మధ్య చాలా అంశాలు ఉంటాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలైంది. దీన్ని న్యాయవాది పీవీ కృష్ణయ్య గత వారం దాఖలు చేశారు. ఆంధ్ర ప్రాంతం, హైదరాబాద్ రాష్ట్రంలో ఒక భాగమని, తెలంగాణ ప్రాంతాలను కలుపుతూ 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలన్న అభ్యర్థదను కేంద్రం 1969, 1972లలో తిరస్కరించిందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కానీ, అందుకు భిన్నంగా యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేయాలని విన్నవించారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం, జస్టిస్ రంజనా దేశాయ్, జస్టిస్ రంజన్ గగోయ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. విభజనపై కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకొనందున దానిపై విచారణ జరపడం సరికాదని అభిప్రాయపడింది. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిర్ణయం తీసుకుందని, రాష్ట్ర ఏర్పాటు ఏవిూ మొదలు కాకూండానే పిటిషన్ ఎలా వేస్తారని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. కేంద్రం తెలంగాణపై ఇంకా బిల్లు పెట్టనుందున పిటిషన్ విచారణకు అర్హమైనది కాదని పేర్కొంది. విభజన ప్రక్రియ మొదలు కాకుండా ఎలా విచారణ చేపడతామని ప్రశ్నించింది. రాష్ట్ర ఏర్పాటుకు, ప్రకటనకు మధ్య చాలా అంశాలు ఉంటాయని తెలిపింది. అయితే, రాష్టాన్న్రి విభజించే అధికారం కేంద్రానికి లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించగా ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించే, ఏర్పాటు చేసే అధికారం కేంద్రానికి ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్రాలను విభజించే అధికారం పార్లమెంట్‌కే ఉందన్న న్యాయస్థానం.. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
జోక్యం చేసుకోబోం : హైకోర్టు
హైదరాబాద్ : రాష్ట్ర విభజన నిర్ణయంపై జోక్యం చేసుకొనేందుకు హైకోర్టు నిరాకరించింది. రాష్ట్ర విభజనను ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం తోసిపుచ్చింది. పిటిషన్‌కు విచారణ అర్హత లేదని స్పష్టం చేసింది. రాష్ట్ర విభజనకు సంబంధించి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న ధర్మాసనం పార్లమెంట్‌లో జరిగే చర్చలపై తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ కేసీ భానులతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని స్పష్టం చేస్తూ కొట్టివేసింది. రాష్ట్ర విభజన అంశం కేంద్ర పరిధిలోనిదని, ఈ విషయంలో జోక్యం చేసుకొనేందుకు నిరాకరించింది. విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాకుండా ఎలాంటి చర్యలు చర్యలు చేపట్టలేమని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాకుండా పిటిషన్ వేయడం సరికాదని పిటిషనర్‌ను హెచ్చరించిన ధర్మాసనం పార్టీలు తీసుకున్న నిర్ణయాలకు కోర్టు స్పందించిందని తెలిపింది.