సమ్మె విరమించండి


సమస్యలు కమిటీకి విన్నవించండి
సర్కార్‌ కార్యాలయాల్లో పోటీ దీక్షలా?
సీఎం ఏం చేస్తున్నావ్‌
దిగ్విజయ్‌ సింగ్‌ గుస్సా
ఆంటోనీ కమిటీని కలిసిన సీమాంధ్రులు
న్యూఢిల్లీ, ఆగస్టు 26 (జనంసాక్షి) :
సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న సమ్మెను విరమిం చాలని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ కోరారు. సీమాంధ్ర నాయకులు సోమవారం రాత్రి ఆంటో నీ కమిటీని కలిశారు. అనంతరం దిగ్విజయ్‌ మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనల వల్ల పిల్లల చదువులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, సమ్మెతో బ్యాంకులు, ఇతర కార్యాలయాలు మూతపడి సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సీమాంధ్ర ప్రాంత ప్రజలు, నాయకులకు ఉన్న అభ్యంతరాలపై ఆంటోనీ కమిటీకి చెప్పుకోవాలని సూచించారు. వాదనలు వినేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బిల్లులో, తీర్మానంలో ఏముండాలో చెప్పాలని దిగ్విజయ్‌సింగ్‌ కోరారు. సీమాంధ్రలో ఇకనైనా ఉద్యమాలకు స్వస్తి పలకాలని కోరారు. జైల్లో జగన్‌ దీక్ష గురించి ప్రశ్నించగా ఆయన స్పందించడానికి నిరాకరించారు. హోం మంత్రిని ఆ విషయం అడగాలని సూచించారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో పోటాపోటీ ఉద్యమాలు ఆపాలని, ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర నేతల సమక్షంలోనే సీఎం కిరణ్‌కు దిగ్విజయ్‌ ఫోన్‌ చేసి చీవాట్లు పెట్టారు.