నిరసన దీక్ష ఆంధ్రా జైలులో చేసుకో టీ అడ్వకేట్‌ జేఏసీ


హైదరాబాద్‌, ఆగస్టు 26 (జనంసాక్షి) :
తెలంగాణలోని నాలుగున్నర కోట్ల ప్రజలను వంచించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌ చంచల్‌గూడ జైలులో కాకుండా సీమాంధ్ర ప్రాంతంలో జైళ్లో చేసుకోవాలని టీ అడ్వకేట్‌ జేఏసీ డిమాండ్‌ చేసింది. అడ్వకేట్‌ జేఏసీ చైర్మన్‌ శ్రీరంగరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమవారం జైళ్ల శాఖ డీజీని కలిశారు. జగన్‌ చేస్తున్న దీక్ష రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై త్వరలో హైకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోతున్న సమయంలో సీమాంధ్రకు చెందిన న్యాయవాదులు తెలంగాణవారిపై దాడులు చేస్తూ హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణలోని పది జిల్లాల్లో న్యాయవాదులు ర్యాలీలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కరీంనగర్‌ జిల్లాకేంద్రంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి  ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం సీమాంధ్ర న్యాయవాదులపై కఠినంగా వ్యవ హరించకపోతే చట్టప్రకారం పోరాటే చేస్తామన్నారు. ఈసందర్బంగా తెలంగాణా అమరవీరుల స్థూపం వద్ద కూర్చుని మౌన ప్రదర్శన నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లాలో కోర్టునుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.  తెలంగాణాలోని అన్ని జిల్లాల్లో, డివిజన్‌ కేంద్రాల్లో న్యాయవాదులు సీమాంద్రులకు జ్ఞానోదయం కలిగించాలంటూ, వచ్చిన తెలంగాణాను అడ్డుకోకుండా బుద్ది ప్రసాదించాలని కోరుతూ రోడ్లపై నినాదాలు ఇచ్చారు. ఇంతకాలం అక్రమంగా హైదరాబాద్‌ వచ్చి పాగా వేసిందే కాక కేంద్రం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చాక కూడా రాద్దాంతం చేయడం దుర్మార్గమన్నారు. వచ్చిన తెలంగాణాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని న్యాయవాదులు హెచ్చరించారు. తెలంగాణా జిల్లాల వ్యాప్తంగా న్యాయవాదులు రోడ్డెక్కడంతో ఉద్యమం మరోసారి ఉవ్వెత్తున ఎగిసి పడింగా అన్నట్లుగా కనిపించింది. అన్ని జిల్లాల్లో సైతం టిఆర్‌ఎస్‌ నేతలు న్యాయవాదులకు మద్దతు పలికారు. దేహిమంటూ వచ్చి హైదరాబాద్‌ మాది అనడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు హెచ్చరించారు. బతకాడినికి వచ్చిన సీమాంధ్రులు నేడు స్థానికులపైనే పెత్తనం చలాయిస్తున్నారని ఆరోపించారు.