ఆహార భద్రత బిల్లు ఆమోదం


ఇది సామాన్యులకు భద్రత : సోనియా
దేశంలో 67 శాతం ప్రజలకు లబ్ధి
ఏటా 1.24 లక్షల కోట్ల వ్యయం
న్యూఢిల్లీ, ఆగస్టు 26 (జనంసాక్షి) :
సోనియాగాంధీ మానస పుత్రిక, యూపీఏ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఆహార భద్రత బిల్లుకు సోమవారం రాత్రి లోక్‌సభ ఆమోదం తెలిపింది. భారతదేశం జనాభాలోని మూడింటా రెండొంతుల మంది పేదలకు భారీ సబ్సిడితో ఆహార ధాన్యాలు అందించడానికి ఉద్దేశించిన బిల్లు ఆమోదానికి అధికార యూపీఏ అనేక చర్యలు తీసుకుంది. తీవ్ర జ్వరంతో బాధ పడుతూ కూడా సోనియాగాంధీ ఈ బిల్లుకోసమే కోసమే లోక్‌సభకు హాజరయ్యారు. బిల్లుపై ఎనిమిది గంటల పాటు చర్చ జరిగింది. బిల్లుకు ప్రతిపక్షాలు దాదాపు 300 సవరణలను ప్రతిపాదించగా, సభ అన్నింటినీ తోసిపుచ్చింది. అయితే బిల్లుపై ఓటింగ్‌ జరగడానికి కొద్ది క్షణాల ముందు మద్దతిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఈమేరకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్‌ ప్రకటన చేశారు. బిల్లు అరకొరగా, బలహీనంగా ఉన్నా పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తాము మద్దతిస్తున్నామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక దీన్ని మరింత మెరుగు పరుస్తామని చెప్పారు. అన్నాడీఎంకే, శివసేన బిల్లును వ్యతిరేకించాయి. సమాజంలో దురదృష్టవంతులైన వర్గాల కోసమే ఆహార భద్రత బిల్లును ప్రవేశపెట్టామని, దేశంలోని పౌరులందరికీ ఆహార భద్రత బాధ్యతను భారతదేశం తలకెత్తుకుందనే సందేశాన్ని ప్రపంచానికి చాటాల్సిన సమయం ఆసన్నమైందని బిల్లుపై చర్చ సందర్భంగా సోనియాగాంధీ అన్నారు. ఈ బిల్లు ద్వారా దేశ జనాభాలో 67 శాతం మంది లబ్ధిపొందునున్నారు. ఈ పథకానికి ఏటా 1.24 లక్షల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. రాజ్యసభలోనూ బిల్లు ఆమోదం పొందుతుందని కేంద్రమంత్రి థామస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నూతన పథకం ద్వారా దాదాపు 80 కోట్ల మందికి ఆహార పదార్థాలు సబ్సిడీపై అందజేస్తారు. ఒక్కొకక్కరికి రూపాయి నుంచి మూడు రూపాయలకు కిలో చొప్పున ఐదు కేజీల ఆహార ధాన్యాలు (బియ్యం, గోధుమలు, పప్పులు) సరఫరా చేస్తారు. ఏటా 62 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాలు అందజేస్తారు. దేశంలో 2.43 కోట్ల మంది నిరుపేదలకు అంత్యోదయ అన్న యోజన కార్డులు, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నెలకు 35 కేజీల చొప్పున ఆహార ధాన్యాలు అందజేస్తారు. రేషన్‌కార్డుల జారీ ప్రకారం 18 ఏళ్లు దాటిన మహిళను కుటుంబ పెద్దగా పరిగణిస్తారు. గర్భిణులు, ప్రసవం తర్వాత శిశువులకు ఆరు నెలలు వచ్చే వరకూ ఉచితంగా ఆహారం అందజేస్తారు. ప్రతి శిశువుకు ఆరేళ్లు నిండేవరకూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఉచితంగా పౌష్టికాహారం అందజేస్తారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లోని ఆరు నుంచి 14 ఏళ్లలోపు విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తారు. ఆహారభద్రత బిల్లుతో సామాన్యులకు కూడా భద్రత కలుగుతందని యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ అన్నారు. 2009 ఎన్నికల సమయంలో తామిచ్చిన హామీ మేరకే ఆహార భద్రత బిల్లును తీసుకు వచ్చామని సోనియా గాంధీ సోమవారం లోకసభలో అన్నారు. ఆహార భద్రత బిల్లు పైన లోకసభలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. 2009లో ఇచ్చిన హామీ మేరకే తాము బిల్లు తెచ్చామని సోనియా అన్నారు. హామీని నిలబెట్టుకున్నందుకు తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ బిల్లును సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. ఆహార భద్రత బిల్లు ద్వారా చారిత్రాత్మక అడుగు వేసే అవకాశం లభించిందన్నారు. దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కర్షకులకు, కార్మికులకు ఈ బిల్లు ఉపయోగకరమైనదన్నారు. పేద ప్రజల అభ్యున్నతే తమ లక్ష్యమని చెప్పారు. బిల్లు ద్వారా ఆహార పదార్థాలు వృథా కాకుండా నివారించవచ్చునన్నారు. దీనిద్వారా రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఏ చిన్నారి పోషకాహార లోపంతో బాధపడకూడదన్నదే తమ లక్ష్యమన్నారు. అంతకుముందు  ఆహార భద్రత బిల్లుపై లోక్‌సభలో కేంద్రమంత్రి కేవీ థామస్‌ చర్చ ప్రారంభించారు. రాష్ట్రాలకు  ప్రస్తుతం ఉన్న కేటాయింపులను కొనసాగిస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని, ఈ బిల్లుతో ప్రజాపంపిణీ వ్యవస్థ మరింత జవాబుదారీతనంతో పనిచేస్తుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఆహార భద్రత బిల్లుతో రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఆహార బిల్లు పథకం కేవలం ఎన్నికల కోసం తీసుకు వచ్చిన పథకమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ ఆరోపించారు. ఎన్నికల కోసం కాకుంటే ఇన్నాళ్లు ఏం చేశారని, ఆరు నెలల ముందైనా తీసుకు రావాల్సిందన్నారు. బిల్లు పైన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయం తీసుకోవాల్సిందన్నారు. ఈ పథకంలో రైతుల పంటలకు గ్యారెంటీ ఎక్కడన్నారు. కొంతమంది రూపాయి కూడా వెచ్చించలేదని స్థితిలో ఉన్నారని, అలాంటి వారికి ఉచితంగా ఇవ్వాలన్నారు. ఆహార భద్రత బిల్లులతో రాష్టాల్రపై పెను భారం పడుతుందని, వాటిని ఎలా భరిస్తారన్నారు. దారిద్యరేఖకు దిగువన ఉన్న పేదల సంఖ్యపై సరైన గణాంకాలు లేకుండానే బిల్లును తీసుకు వచ్చారన్నారు. ప్రజలు ఆకలితో చనిపోతున్న విషయం కేంద్రానికి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. పేదల కోసం ప్రారంభించిన పథకాలు వారికి చేరడం లేదని జేడీయూ నేత శరద్‌యాదవ్‌ అన్నారు. ఆహారభద్రత బిల్లుపై లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ ఈ బిల్లు ద్వారా పేదలకన్నా దళారులకే ఎక్కువ లబ్ధి కలుగుతుందన్నారు. వెనుకబడిన వర్గాలను పైకి తీసుకురానంతవరకు ఎన్ని పథకాలు తెచ్చినా ప్రయోజనం లేదని శరద్‌యాదవ్‌ అభిప్రాయపడ్డారు. ఇది ఆహార భద్రత బిల్లు కాదని, ఓట్ల భద్రత బిల్లని బిజెపి  సీనియర్‌ నేత మురళీమనోహర్‌ జోషి అన్నారు. లోక్‌సభలో ఆహార భద్రత బిల్లుపై సాగుతున్న చర్చలో ఆయన మాట్లాడుతూ ఆహార భద్రత బిల్లును ప్రవేశపెట్టడానికి నాలుగేళ్లు ఎందుకు జాస్యం చేశారని ప్రశ్నించారు. బిల్లులో లోటుపాట్లు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.