విభజన తర్వాత సీమాంధ్ర సమస్యల పరిష్కారం


అన్ని పార్టీలు అభిప్రాయాలు చెప్పాకే కాంగ్రెస్‌ నిర్ణయం
ఇప్పుడు వైకాపా మాటలకు విలువలేదు : దిగ్విజయ్‌
న్యూఢిల్లీ, ఆగస్టు 27 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత సీమాంధ్ర ప్రాంత సమస్యలు పరిష్కరిస్తామని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీ ఇలా అన్ని పార్టీలు తెలంగాణపై నిర్ణయం తీసుకున్న తర్వాతే రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్‌ నిర్ణయాన్ని ప్రకటించిందని ఆయన పేర్కొన్నా రు. ఇప్పుడు వైఎస్సార్‌ సీపీ, టీడీపీ పార్టీల అభిప్రాయం మారడంతో ఆ పార్టీల మాటలకు విలువలేదన్నారు. కొన్ని రోజులుగా ఆంటోని కమిటీని పలువురు నాయకులు, రాజకీయాలతో సబంధం లేని వాళ్లు కలుస్తున్నా రని, ఈ రోజు కూడా కొంత మంది నాయకులతో సమావేశమయ్యా మని చెప్పారు. బుధవారం జన్మాష్టమి కావడంతో సెప్టెంబర్‌ మూడో తేదీన కమిటీ మళ్లీ సమావేశమవుతుందని తెలిపారు. రెండేళ్లుగా కాం గ్రెస్‌ పార్టీకి చెందిన ఇరు ప్రాంతాల నాయకులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడితో విస్తృతంగా చర్చించారని, అప్పట్లో వాళ్లంతా అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్ప డంతో విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఉన్నట్టుండి వాళ్లు ఎదురు తిరగడం భావ్యం కాదని అన్నారు. ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ విమర్శలు చేస్తున్నారని, కానీ బీజేపీయే రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన విషయం ఆయకు గుర్తులేదా అని దిగ్విజయ్‌ ప్రశ్నించారు.