చెప్పుకో’లేఖ’


హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి)
తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధినేత కుప్పిగంతులు కొనసాగు తూనే ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ, ప్రధానిని నిందిస్తూ ఆయన బుధవారం మరో లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత సీమాం ధ్రలో నెలకొన్న ఆందోళనలపై దృష్టి సారించాలని ఆయన లేఖలో కోరారు. కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేస్తున్న ఆందోళనలపై మీరు స్పందించరా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఆందోళనలను పరిష్కరించే బాధ్యత మీపై లేదా అని ఆయన పీఎంను ప్రశ్నించారు. సమస్యలపై ఇప్పటికైనా స్పందించాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ ప్రకటనలు సీమాంధ్రులను రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయని, రాజ్యసభలో చిదంబరం ప్రకటన బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా ఉందని మండిపడ్డారు. అలాగే రాష్ట్రంలో విభజన తర్వాత సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆత్మగౌరవ యాత్ర పేరుతో మరోసారి ప్రజల్లోకి వెల్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గతంలో పాదయాత్ర ద్వారా చేరుకోని ప్రదేశాల్లో బస్సు యాత్ర చేసేందుకు సిద్ధమవగా, ఈతరుణంలో కేంద్రం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్రలో ఉద్యమాలు పెట్రేగి పోతున్నాయి. దీంతో అక్కడి పరిస్థితులను తమపార్టీవైపు మలుపుకునే ఉద్దేశ్యంతో ఆత్మగౌరవయాత్ర చేయాలని నిర్ణయించుకున్న బాబు ఈనెల 25 నుంచి విజయనగరంలో ప్రారంభించాల్సి ఉంది. అయితే అక్కడ సమైక్య ఉద్యమాలు తీవ్రంగా ఉండడంతో అనంతపూర్‌, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను వదిలేసి, గుంటూరులో చేపట్టాలని నిర్ణయానికి వచ్చారు. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి తప్పనిసరిగా చేపట్టనున్నానని, గతంలో పాదయాత్ర చేయనిప్రదేశాల్లో ఈయాత్రకు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేయాలని ఆయన గత రాత్రే నేతలకు ఆదేశం జారీ చేయడంతో గుంటూరులో పార్టీకి చెందిన నేతలంతా సమావేశం అవుతున్నారు. ఈసాయంత్రంకల్లా రూట్‌ మ్యాప్‌ సిద్దంచేసి బాబుతో అప్రూవ్‌ చేయించనున్నారు.