విశాలంధ సభను అడ్డుకున్న తెలంగాణ జర్నలిస్టులు


సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉద్రిక్తత
హైదరాబాద్‌,
ఆగస్టు 28 (జనంసాక్షి) :
అబద్ధాల పునాదులపై నిర్మించిన విశాలాంధ్ర మహాసభ కార్యక్రమాన్ని తెలంగాణ జర్నలిస్టులు అడ్డుకున్నారు. దీంతో నగరంలోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు బుధవారం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనపై రెండు విడతలుగా బస్సు యాత్ర నిర్వహించి ప్రజల మనోభావాలను తెలుసుకున్నామని మహాసభ ప్రతినిధి నల్లమోతు చక్రవర్తి తెలిపారు. సీమాంధ్రలోని అన్ని ప్రాంతాల ప్రజలు సమైక్యవాదాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే తెలంగాణ ప్రాంతంలో కూడా యాత్ర నిర్వహిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజనపై ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొందని, ఇందుకు రాజకీయ పార్టీలే కారణమని ఆరోపించారు. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచేందుకు సీమాంధ్రకు చెందిన అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడారు. దీనిపై తెలంగాణకు చెందిన జర్నలిస్టులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా చక్రవర్తి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ విలేకరులు సమావేశాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు సమావేశాన్ని ముగించాలని ఆదేశించారు. విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులను అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. సంయమనం పాటించాలని జర్నలిస్టులను కోరారు. కాగా, ప్రెస్‌క్లబ్లో పోలీసులు వీడియో తీయడాన్ని జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశానికి పరకాల ప్రభాకర్‌ దూరంగా ఉన్నారు. పోలీసుల సూచన మేరకే ఆయన ఈ సమావేశానికి రాలేదని సమాచారం.