తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవద్దు


హైకమాండ్‌ నిర్ణయానికి సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు కట్టుబడాల్సిందే
జిల్లాల్లో సభల నిర్వహణకు టీ మంత్రుల నిర్ణయం : గీతారెడ్డి
హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవద్దని, సీమాంధ్ర ప్రాంత నాయకులు హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని రాష్ట్ర మంత్రి గీతారెడ్డి కోరారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని కోరుతూ గురువారం హైదరాబాద్‌లోని టీటీడీ కల్యాణమండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆమె పేర్కొన్నారు. నగరంలోని ఆమె నివాసంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో వివరాలు వెల్లడించారు. సోనియాగాంధీ అనుకున్నదంటే అది కచ్చితంగా అమలు చేసి తీరుతారన్నారు. ఆమెలో ఉన్న పట్టుదల ఇప్పటికే చాలాసార్లు రుజువైందన్నారు. నిన్నటికి నిన్న ఆహార భద్రత బిల్లు విషయంలో కూడా సోనియాగాంధీ అనుకున్నది సాధించారని గుర్తుచేశారు. దీనివల్ల దేశంలోని ప్రతిఒక్కరికి ఆహారం సమస్య కాకుండా ఉంటుందన్నారు. పేదల ఆకలిని తీర్చే చట్టం తీసుకువచ్చినందుకు సోనియాగాంధీకి తమ సమావేశంలో అభినందిస్తూ తీర్మానం చేయడం జరిగిందన్నారు. అలాగే తెలంగాణా బిల్లును కూడా త్వరగా పార్లమెంట్‌లో పెట్టి రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరడం జరుగుతుందన్నారు. తమ సమావేశాల్లో ఇప్పటికిప్పుడైతే బిల్లు త్వరగా పెట్టి రాష్ట్రం ఏర్పాటు చేయాలనేదే ప్రధాన ఏకైక డిమాండ్‌ ప్రతిపాదన ఉందన్నారు. దీనికోసం అవసరమైతే మరోసారి ఆంటోని కమిటీని కలిసేందుకు కూడా వెనుకాడబోమన్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి, సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్‌ పదేపదే తెలంగాణ పై నిర్ణయం జరిగిపోయిందని చెపుతున్నా కూడా సీమాంధ్రులు వారి ఓపికకు పరీక్ష పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉండడం వల్లే తాము ప్రశాంతంగా ఉన్నామన్నారు. సీమాంధ్రులు రెచ్చగొడుతున్నా, దాడులకు పాల్పడుతున్నా కూడా సంయమనంతోనే వ్యవహరిస్తున్నామన్నారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని అమలు చేయాలని, పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం త్వరగా ఏర్పాటు చేయాలనేదే తమ డిమాండ్‌ అన్నారు. పదేళ్లు హైదరాబాద్‌లో రాజధానిని ఉంచుకోవాలని అంగీకరించడం అంటేనే తమ బ్రాడ్‌నెస్‌ అర్థం చేసుకోవాలన్నారు. అదిపెద్ద సాహాసోపేతమైన సహకారమే అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందకు ఎన్ని సార్లు తిరిగినా కూడా ప్రయోజనం ఉండదని తమ సోదరులకు తెలియక పోవడం బాధగా ఉందన్నారు. విడిపోయినా కూడా కలిసి ఉందామన్నదే తమ వాదనన్నారు. దేశంలోని 28 రాష్ట్రాలతో కలిసి ఉన్నట్లుగానే రాబోయే సీమాంధ్ర రాష్ట్రంతో కూడా కలిసి ఉందామనుకుంటున్నామన్నారు. 7వ తేదీన సీమాంధ్ర ఉద్యోగుల సభకు అనుమతి విషయం పోలీసులు చూసుకుంటారన్నారు. దాంట్లో తాము జోక్యం కలిగించుకోదలుచుకోలేదన్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి అసెంబ్లీ గాంధీ విగ్రహం వద్ద సీమాంధ్ర ప్రజాప్రతినిధులు నిరాహార దీక్ష చేయడాన్ని తాము అడ్డుకోబోమన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడైనా ఎవరైనా ఆందోళనలు చేసుకోవచ్చన్నారు. అవి ఉద్రిక్తతకు దారి తీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపైన, ప్రభుత్వంపై ఉందన్నారు. గ్రామగ్రామాన తెలంగాణా ఇచ్చినందుకు సోనియాకు కృతజ్ఞతలు తెలిపేందుకు కార్యక్రమాలు రూపొందిస్తున్నామని, కొందరు మంత్రులు ఢిల్లీలో, మరికొందరు విదేశాల్లో ఉన్నందున వారితో సంప్రదిస్తున్నామని గీతారెడ్డి తెలిపారు. షెడ్యూల్‌ తయారు చేసిన తర్వాత ప్రకటిస్తామన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే అనే నినాదాన్ని గ్రామాల్లోకి తీసుకెల్లేందుకు అవసరం వచ్చిన ప్రతి వేదికను వినియోగించుకోవాలని అంతకు ముందు జరిగిన సమావేశంలో నిర్ణయించారు. గీతారెడ్డితో పాటు డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, జానారెడ్డి, సారయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.