రూపాయి క్షీణతపై రాజ్యసభలో నేడు ప్రధాని ప్రకటన

న్యూఢిల్లీ, ఆగస్టు 29 (జనంసాక్షి) :
రూపాయి క్షీణతపై శుక్రవారం పార్లమెంట్‌లో ప్రకటన చేస్తానని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. రూపాయి విలువ క్షీణతపై ప్రధాని మన్మోహన్‌ వివరణ ఇవ్వాలని రాజ్యసభలో విపక్షాలకు చెందిన ఎంపీలు పట్టుబట్టారు. నినాదాలు కొనసాగించారు. గందరగోళం నెలకొనడంతో పలుమార్లు సభ కార్యకలాపాలను వాయిదా వేశారు. చివరకు శుక్రవారానికి వాయిదా వేశారు. అంతకుముందు ప్రధాని మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటోందని అన్నారు. ఆర్థిక మందగమనానికి దేశీయ పరిస్థితులు కూడా కొంతవరకు కారణమని ఆయన పేర్కొన్నారు. దీన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని చెప్పారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనంపై లోక్‌సభ దద్దరిల్లింది. కాగా బుధవారం ఆల్‌టైం కనిష్టానికి పడిపోయిన రూపాయి శుక్రవారం 225 పాయింట్లు కోలుకుంది. బుధవారం 68.80లకు పడిపోయిన రూపాయి విలువ గురువారం 65.55కు చేరింది.