ఇండియన్‌ ముజాహిద్దిన్‌ మిలిటెంట్‌ భత్కల్‌ అరెస్టు

న్యూఢిల్లీ, ఆగస్టు 29 (జనంసాక్షి) :
ఇండియన్‌ ముజాహిద్దిన్‌ వ్యవస్థాపక సభ్యుడు యాసిన్‌ భత్కల్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐ) బృందం బుధవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ధ్రువీకరించారు. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీహార్‌ పోలీసులు భత్కల్‌ను, తబరేజ్‌లను ప్రశ్నిస్తున్నారని తెలిపారు. నిఘా వర్గాల సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. ఇదిలా ఉండగా భత్కల్‌ అరెస్టయ్యాడన్న సమాచారం అందడంతో హైదరాబాద్‌ పోలీసులు బీహార్‌కు బయలుదేరి వెళ్ళనున్నట్లు తెలిసింది.
దిల్‌సుక్‌నగర్‌ పేలుళ్ల ఘటనలో..
దిల్‌సుక్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో ప్రధాననిందితుడు ఇండియన్‌ ముజాహుద్దీన్‌ వ్యవస్థాపకుడు భత్కల్‌ను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. అతనితో పాటు మరో ఉగ్రవాది తబరేజ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నిస్తున్నారు. భత్కల్‌ పలు కేసులలో నిందితుడు. భత్కల్‌ స్వస్థలం కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తరకన్నడ జిల్లాలోని భత్కాల్‌. ఢిల్లీ, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, సూరజ్‌, పూనే, తదితర ప్రాంతాలలో జరిగిన బాంబు పేలుళ్లలలో ప్రధాననిందితుడు. 2008 నుంచి ఇండియన్‌ ముజాహుద్దీన్‌ సంస్థలో సోదరునితో కలిసి స్థాపించారు. అప్పటి నుంచి కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నాడు. 2010లో నకిలీ నోట్ల కేసులో కోల్‌కతాలో అరెస్టయ్యారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలై తప్పించుకుని తిరుగుతున్నాడు. భత్కల్‌పై పదిలక్షల రూపాయల రివార్డు ఉంది. ఇటీవల పట్టుబడిన ఉగ్రవాది తుండా అందించిన సమాచారం మేరకు భత్కల్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా దిల్‌సుక్‌నగర్‌ జంట పేలుళ్ల ఘటనలో 16మందికి పైగా చనిపోయిన విషయం తెలిసిందే. అలాగే 2011,సెప్టెంబర్‌లో ఢిల్లీ హైకోర్టు వెలుపల జరిగిన బాంబు పేలుళ్ల దుర్ఘటనలో 12మంది.. ఆ తర్వాత పూనెలోని జర్మన్‌ బేకరీ వద్ద చోటు చేసుకున్న దుర్ఘటనలో 17మంది మరణించిన విషయం విదితమే. యాసిన్‌ భత్కల్‌ను హైదరాబాద్‌కు రప్పిస్తామని నగర కమిషనర్‌ అనురాగ్‌శర్మ తెలిపారు.