ఏపీఎన్‌జీవోల సభకు అనుమతించొద్దు

ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టొద్దు
ప్రభుత్వం, పోలీసులకు నారాయణ హితవు
హైదరాబాద్‌, ఆగస్టు 29 (జనంసాక్షి) :
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రకు చెందిన ఏపీఎన్జీఓలు హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన సెప్టెంబర్‌ 7 బహిరంగ సభకు అనుమతులిచ్చి సమస్యలు సృష్టించొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పోలీసులకు, ప్రభుత్వానికి హితవుపలికారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ఓసారి నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఆపార్టీ నేతలు వ్యతిరేకించడం వల్లే నేడు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఆదిలోనే సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలపై చర్యలు తీసుకుని ఉంటే ఈపరిస్థితి ఇంతవరకు వచ్చేదే కాదన్నారు. బిల్లుపై కసరత్తు ఇంకా ప్రారంభించక పోవడం కూడా కాంగ్రెస్‌ దుశ్చర్యలకు అద్దం పడుతోందన్నారు. సీమాంధ్రలో ఉద్యమాలు రావడానికి కారణం కాంగ్రెస్‌ టిడిపి, వైసిపిలే కారణమన్నారు. తెలంగాణాకు అనుకూలంగా ఉన్నామని చెప్పిన ఆపార్టీలే నేడు యూటర్న్‌ తీసుకుని ఆందోళనలకు దిగడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రజలను కన్‌ఫ్యూజ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ, వైసీపీలపై నారాయణ విరుచుకుపడ్డారు. ఓవైపు సమైక్యాంధ్ర కోసం జగన్‌ జైలులో దీక్షలు చేస్తుంటే విజయమ్మ ఢిల్లీకి వెళ్లి ప్రధానిని, రాష్ట్రపతిని కలువడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ఆయన నిలదీశారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నారా లేదా అనే విషయాన్ని స్పష్టంగా ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. చంద్రబాబు కూడా ఇప్పటికి రెండు విధాలుగా వ్యవహరించడం సరైందికాదన్నారు. నిర్ణయం తీసుకునే వరకు కాంగ్రెస్‌ను తప్పుబట్టిన ఆయన నిర్ణయం జరిగిపోయాక సీమాంధ్రలో తన క్యాడర్‌తో దీక్ష లు ఆందోళనలు చేయించడం చూస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. పార్టీలన్నప్పుడు ఒక నిర్ణయంపై కట్టుబడి ఉంటే బాగుంటుందన్నారు. ఎలాగూ ప్రజాస్వామ్య దేశంకదాని ఇష్టమొచ్చినట్లు అడుగులు వేస్తే ఇలాంటి సమస్యలే ఉత్పన్నం అవుతాయన్నారు. కేంద్రం ఈతాటాకు చప్పుళ్లకు లొంగకుం డా ఈపార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు.