హైదరాబాద్‌ సభ అనుమతికి మంత్రులు సహకరించాలి


ముల్కీ రూల్స్‌ వారోత్సవాలు ప్రశాంతంగా నిర్వహిస్తాం
సమ్మె విరమించండి.. విభజనకు సహకరించండి : కోదండరామ్‌
హైదరాబాద్‌, ఆగస్టు 31 (జనంసాక్షి) :
హైదరాబాద్‌లో ఈనెల 7న నిర్వహించనున్న సభకు అనుమతి ఇప్పించేందుకు మంత్రులు సహకరించాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే బిల్లును తెలంగాణాకు చెందిన కాంగ్రెస్‌ మంత్రులు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని కోదండరామ్‌ పేర్కొన్నారు. శనివారం తెలంగాణ మంత్రులతో ఆయనతోపాటు టీ జేఏసీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భం గా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను వివరంగా ఇరువర్గాలు సమీక్షించుకున్నాయి. టీ మంత్రులు ఏం చేయాలనే అంశంపై కోదండరామ్‌తో పాటు జేఏసీ నాయకులు పలు ప్రతిపాదనలుంచినట్లు సమాచారం. సీమాంధ్రులను తిప్పికొట్టేందుకు కాస్తా పదును పెట్టుకోవాల్సిన అవసరం ఉందని టీ మంత్రులకు కోదండరామ్‌ సూచించినట్లు సమాచారం. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముల్కీరూల్స్‌ వారోత్సవాలను

ప్రశాంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తాము ఎక్కడ కూడా హింసను ప్రోత్సహించడంలేదని, హింసను కోరుకోవడం లేదన్నారు. సెప్టెంబర్‌ 7వతేదీన తాము హైదరాబాద్‌లో నిర్వహించే శాంతి సద్భావన యాత్రకు మంత్రులు అనుమతిప్పించాలని కోరారు. ఏపీఎన్జీఓలకు అనుమతులు లభిస్తే మాత్రం తమకు రాకుండా ఉంటే గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుని తీరుతామని హెచ్చరించినట్లు ఆయన పేర్కొన్నారు. 7వ తేదీన తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామన్నా కూడా ప్రభుత్వం అంగీకరించడం లేదన్నారు. గత 9 ఏళ్లుగా కూడా ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంపై దుర్మార్గంగా వ్యవహరిస్తూనే వస్తోందని ఆరోపించారు. సీమాంధ్రలో విధ్వంసాలు జరిగినా కూడా కనీసం కేసులు పెట్టడం లేదన్నారు. నిత్యం ఆందోళనలు జరుగుతున్నాయని, జనజీవనానికి అడ్డంకులు కలుగుతూనే ఉన్నాయన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కనీసం అనుమతి మాటేమోగాని రోడ్డుపైకి రాకుండా ఇళ్లల్లోనే బైండోవర్లు, అరెస్టులు చేశారన్నారు. తమ ఉద్యమంపై ప్రభుత్వం నిర్బంధకాండ ప్రయోగిస్తోందని ఆరోపించారు. ఏపీఎన్జీఓలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నా కూడా తాము సంయమనంతోనే ఉంటున్నామని, సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మరింత ఓపికతోనే ఉంటామన్నారు. అయితే తమ ఓపికకు కూడా హద్దు ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుసందర్బాల్లో ప్రకటించినందున సీమాంధ్రులు, ఏపీఎన్జీఓలు రాష్ట్రం ప్రశాంతంగా విడిపోయేందుకు సహకరించాలన్నారు.