కనబడని ఫైళ్లను వెలికితీస్తాం


ముమ్మర దర్యాప్తునకు ఆదేశిస్తా
ప్రధాని మన్మోహన్‌
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) :
ఎట్టకేలకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ మౌనం వీడారు. విపక్షాల ఒత్తిడికి తలొగ్గి నోరుమెదిపారు. బొగ్గు కుంభకోణంపై ప్రకటన చేశారు. గల్లంతైన బొగ్గు దస్త్రాలను వెలికితీసేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ప్రభుత్వానికి ఏదీ దాచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బొగ్గు కుంభకోణంపై  దర్యాప్తు చేస్తున్న సీబీఐకి ఇప్పటికే లక్ష దస్త్రాలను అప్పగించినట్లు చెప్పారు. ఒకవేళ దస్త్రాలు గల్లంతైనట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపార. ఈ మేరకు మంగళవారం ప్రధాని రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. బొగ్గు దస్త్రాల గల్లంతుపై ప్రతిపక్షాలు మంగళవారం పార్లమెంట్‌ను స్తంభింపజే శాయి. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఉభయ సభల్లోనూ బొగ్గు స్కాంపై చర్చకు పట్టుబట్టింది. ఫైళ్ల గల్లంతుపై ప్రధాని మౌనం వీడి, ప్రకటన చేయాలని పట్టుబట్టింది. దాస్త్రాల గల్లంతుకు మన్మోహన్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేసింది. మంగళవారం ఉదయం సమావేశమైన నిమిషాల వ్యవధిలోనే లోక్‌సభ విపక్షాల ఆందోళనల మధ్య మధ్యాహ్నానికి వాయిదా పడింది. కాంగ్రెస్‌ ఎంపీ సందీప్‌ దీక్షిత్‌ టీడీపీ ఎంపీలపై నోరు పారేసుకోవడంపై విపక్షాలు మండిపడ్డాయి. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, బొగ్గు కుంభకోణంపై ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌ పట్టుబట్టడంతో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. అసభ్యపదజాలంతో దూషించిన దీక్షిత్‌ డౌన్‌డౌన్‌ అంటూ విపక్షాల నేతలు నినాదాలు చేశారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు స్పీకర్‌. అంతకు ముందు కాంగ్రెస్‌ ఎంపీ శివప్రసాద్‌పై టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. మరోవైపు, సీమాంధ్ర టీడీపీ ఎంపీలపై కాంగ్రెస్‌ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, తదితరులు కూడా సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు. ఆయా నోటీసులు అందాయని స్పీకర్‌ సభలో ప్రకటించారు. మరోవైపు, పార్లమెంట్‌ సమావేశాలు ముగియవస్తున్న బొగ్గు కుంభకోణంపై చర్చ చేపట్టకపోవడంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. బొగ్గు దస్త్రాతల గల్లంతుపై ప్రధాని సమాధానం చెప్పాలని సుష్మాస్వరాజ్‌ డిమాండ్‌ చేశారు. బీజేపీ సభ్యులు సభను స్తంభింపజేశారు. మరోవైపు, ఇదే అంశంపై బీజేపీ రాజ్యసభనూ అడ్డుకుంది. ప్రధాని మౌనం వీడాల్సిందేనని స్పష్టం చేసింది. అటు సీపీఎం కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బొగ్గు దస్త్రాల గల్లంతుకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ఓ ప్రకటన చేశారు. గల్లంతైన దస్త్రాలను వెలికితీసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని చెప్పారు. అన్ని దస్త్రాలను వెలికితీసి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు జరుపుతున్న సీబీఐకి అందజేస్తామని తెలిపారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో దస్త్రాలను దర్యాప్తు సంస్థకు ఇచ్చామన్నారు. ఒకవేళ ఆయా పత్రాలు లభించకపోతే ఆ మేరకు సీబీఐకి ఓ నివేదిక సమర్పిస్తామన్నారు. ప్రభుత్వం ఏదీ దాచడం లేదని స్పష్టం చేశారు. దర్యాప్తు విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. గతంలో కాగ్‌కు, ఇప్పుడు సీబీఐకి సహకారం అందిస్తున్నామన్నారు. దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని, సుప్రీంకోర్టే స్వయంగా దర్యాప్తును పర్యవేక్షిస్తోందని వివరించారు.