ప్రజాభిప్రాయానికే ప్రాధాన్యత


ఆంధ్రులకు అన్యాయం జరగదు
దిగ్విజయ్‌ భరోసా
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ పార్టీ ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు రెండు సార్లు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, వారి అభిప్రాయానికి తమ పార్టీ తప్పకుండా ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం దిగ్విజయ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై సీఎం ఆయనకు వివరించారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం, ఉద్యోగుల సమ్మె తదితర అంశాలను తెలిపారు. సమైక్య వాదం తలకెత్తుకున్న కిరణ్‌ సీమాంధ్ర ఉద్యమం తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, గతంలో ఎన్నడూ లేనిరీతిలో ఉద్యమం సాగుతోందని వివరించారు. విభజన వల్ల తలెత్తే సమస్యలపై స్పష్టత ఇవ్వనంత కాలం ఆందోళనలు కొనసాగుతాయన్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకూ విభజనపై ముందుకు వెళ్లమని ప్రకటించాలని కోరారు. రాష్టాన్న్రి సమైక్యంగానే కొనసాగించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అయితే, పార్టీ నిర్ణయాత్మక మండలి సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నాక, దాన్ని మార్చలేమని దిగ్విజయ్‌ స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. ఆందోళనలు, ఉద్యమాలు క్రమంగా తగ్గుముఖం పడతాయని, అప్పటివరకూ శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూడాలని ఆదేశించినట్లు తెలిసింది.భేటీ ముగిసిన అనంతరం దిగ్విజయ్‌ విలేకరులతో మాట్లాడారు. రెండుసార్లు గెలిపించిన ఆంధ్రప్రదేశ్‌ రాష్టాన్రికి తాము అన్యాయం చేయమని తెలిపారు. రాష్ట్రంలో రెండు సార్లు ప్రజలు తమను గెలిపించారని గుర్తు చేసిన దిగ్విజయ్‌.. ఆంధ్ర ప్రాంతానికి సరైన న్యాయం చేస్తామని చెప్పారు.