కుట్రతో కూడిన అనుమతి


సంయమనం పాటించండి : జానారెడ్డి
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) :
ఏపీఎన్జీవోల సభకు ప్రభుత్వం కుట్రతో కూడిన అనుమతి ఇచ్చిందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కె. జానారెడ్డి అన్నారు. సచివాలయంలో బుధ వారం ఉదయం మంత్రి జానారెడ్డితో ఐకాస చైర్మన్‌ కోదండరామ్‌, టీజీవో నేత శ్రీని వాస్‌గౌడ్‌ తదితరులు భేటీ అయ్యారు. ఈనెల 7న నిర్వహించనున్న శాంతిర్యాలీ, తదితర అంశాలపై మంత్రి జానారెడ్డితో వారు చర్చించారు. అలాగే టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావుతో మంత్రి జానారెడ్డి భేటీ అయ్యారు. రాజకీయ పరిస్థితులు, ఢిల్లీ పరిణామాలు తదితర విషయాలపై వారిరువురు చర్చించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వమే కుట్రతో ఏపీఎన్‌జీవోల సభకు అనుమతిచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సందర్భంలో రెచ్చిపోతే దానిని బూతద్దంలో చూపించి ఉద్యమంపై నిందలు మోపే అవకాశం ఉందని జానా హెచ్చరించారు. ఏపీఎన్‌జీవోల సభకు అనుమతి ఇచ్చినట్లుగానే టీ జేఏసీ తలపెట్టిన శాంతి ర్యాలీకి కూడా అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి, డీజీపీల తీరు ఏమాత్రం బాగాలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశముందని అన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రెండు ప్రాంతాల ప్రజలు సంయమనం పాటించాలని అన్నారు. అన్నదమ్ముల్లా కలిసి ఉండేలా వాతావరణాన్ని కలిపించుకోవాలన్నారు. విభజన తరువాత సీమాంధ్రప్రాంత ఉద్యోగులు కొంతకాలం ఇక్కడే పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. ఎపిఎన్జీవోలు శాంతియుతంగా ఈ నెల 7న సభ నిర్వహించుకోవాలని సూచిస్తున్నామని అన్నారు. అన్ని పార్టీలు లేఖలు ఇచ్చాకే కాంగ్రెస్‌ పార్టీ తుది నిర్ణయం తీసుకుందన్నారు. అన్ని పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. కొన్ని పార్టీల ద్వంద్వ వైఖరి బాధాకరంగా ఉందని అన్నారు. ఏమైనా సమస్యలుంటే కేంద్రమంత్రి ఆంటోని కమిటీకి చెప్పుకోవాలని సూచించారు. అనవసరంగా ప్రజలను రెచ్చగొట్టడం మంచిపద్దతి కాదన్నారు. ఒకేరోజు పోటీ సభ నిర్వహించేందుకు యత్నించడం సమంజసం కాదని అన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలు, ఉద్యోగులు, సంయమనం పాటిస్తున్నారని అన్నారు.