ఇది కాదా వివక్ష


వాళ్లకు అనుమతించి మాకెందుకివ్వరు? : కోదండరామ్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) :
ఏపీఎన్జీవో సభకు అనుమతిచ్చిన ప్రభుత్వం, తెలంగాణ జేఏసీ శాంతి ర్యాలీకి అను మతివ్వక పోవడం దారుణమని, తామేమైనా రాక్షసులమా అని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్‌ ఆచార్య కోదండరామ్‌ అన్నారు. శాంతి ర్యాలీకి అనుమతిని ఇప్పించే బాధ్యతను మంత్రి జానారెడ్డికి అప్పగించామన్నారు. తమ శాంతి ర్యాలీకి అనుమతి రాకుంటే అందుకు తెలంగాణ మంత్రులదే బాధ్యత అన్నారు. శాంతి ర్యాలీకి అనుమతివ్వకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిం చారు. ఈ మేరకు వారు డీజీపీని కలిసి అనుమతి కోసం డిమాండ్‌ చేశారు. తెలంగాణపై కుట్ర చేస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణను ఆపలేరన్నారు. ముఖ్యమంత్రి వైఖరి వల్లనే శాంతిభద్రతలకు రాష్ట్రంలో విఘాతం కలుగుతున్నాయన్నారు. ఏపీఎన్జీవోల సభకు అనుమతి రావడం ముఖ్యమంత్రి పనే అన్నారు. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్న కిరణ్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముల్కీ అమరవీరుల ర్యాలీకి అనుమతి కోరితే ప్రభుత్వం శాంతిభద్రతల సమస్యను సాకుగా చూపిందని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివక్షతో పనిచేస్తోందని మండిపడ్డారు. రేపటి సభ సందర్భంగా ఏమైనా జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. సీమాంధ్ర సభకు అనుమతిని ఇచ్చి తెలంగాణ శాంతి ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడం వివక్షకాక మరోటి కాదన్నారు. ఇది కావాలని చేస్తున్నదే తప్ప మరోటి కాదన్నారు. శాంతి ర్యాలీకి అనుమతిస్తే మత విద్వేషాలు పెరుగుతాయని అనుమతివ్వని ప్రభుత్వం ఎపిఎన్జీవోల సభకు ఎలా అనుమతి ఇచ్చిందని టిఎన్జీవో నేత శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రశ్నించారు. హైదరాబాదులో అల్లర్లు సృష్టించేందుకే ఇక్కడ సభ పెడుతున్నారని మండిపడ్డారు. ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇచ్చి తమకు హైదరాబాదులో సమావేశానికి ఎందుకు అనుమతివ్వరని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. తెలంగాణ వారికి హైదరాబాదులో సమావేశాలు పెట్టుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ పౌరుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల హక్కులనే కాకుండా అంబేడ్కర్‌ వారసుల హక్కులను కాలరాస్తున్నారన్నారు. సీమాంధ్ర నుండి లక్షల సంఖ్యలో హైదరాబాదుక రప్పించి ఇక్కడ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఎపిఎన్జీవోల సభకు అనుమతి లభించిందన్నారు. ఉద్యోగస్తుల పేరుతో సీమాంధ్రులను ఇక్కడకు రప్పించి యుద్ధ వాతావరణం కల్పిస్తున్నారని మండిపడ్డారు. ఇది సిఎం, డిజిపి ఆడుతున్న కుట్ర అని అన్నారు.