తెలంగాణ జిల్లాల్లో కొనసాగుతున్న బంద్‌


పలు ప్రజాసంఘాల సంపూర్ణ మద్దతు
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) :
ఏపీఎన్‌జీవోలు సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో శనివారం ఎల్బీ స్టేడియం వేదికగా నిర్వహించతలపెట్టిన సభకు ముఖ్యమంత్రి ఏకపక్షంగా అనుమతి ఇప్పించడాన్ని వ్యతిరేకిస్తూ టీ జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన బంద్‌ శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రారంభమైంది. హైదరాబాద్‌పై దాడి చేయడంతోపాటు విద్వంసాలు సృష్టించి తెలంగాణా రాష్ట్రాన్ని అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఏపీఎన్జీవోలు నిర్వహిస్తున్న బహిరంగ సభను నిరసిస్తూ శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు తెలంగాణ బంద్‌కు తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపునివ్వడంతో బంద్‌ విజయవంతానికి పలు సంఘాలు, ప్రజాప్రతినిధులు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. తెలంగాణ రాజకీయ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం సుదీర్ఘ చర్చల అనంతరం శాంతిర్యాలీని రద్దు చేసుకుని తెలంగాణ బంద్‌ పాటించాలని పిలుపునిచ్చింది. దీంతో బంద్‌ సక్సెస్‌ చేసేందుకు పలు సంఘాలు ముందుకు వస్తున్నాయి. తెలంగాణ యాదవసంఘం, ఏపీటీఎఫ్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ, రిటైర్డ్‌ ఇంజినీర్స్‌, న్యాయవాదుల సంఘం, ఎమ్మార్పీఎస్‌, మాలమహానాడు, తెలంగాణా డాక్టర్స్‌ అసోసియేషన్‌, విద్యార్థి జేఏసీ, రజక సంఘాల జేఏసీ, తెలంగాణ కాలేజ్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌, లెక్చరర్ల సంఘం, డీటీఎఫ్‌, టీఆర్‌టీయూ సంఘాలు తమ మద్దతు ప్రకటించాయి. రాజకీయ పార్టీల్లో మాత్రం ఇప్పటివరకు కేవలం టీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీకి అనుబంధంగా ఉన్న నాగం జనార్దన్‌రెడ్డి మాత్రమే మద్దతు ప్రకటించారు. ఆర్టీసీలో టీఎన్‌ఎంయూ, ఎంప్లాయీస్‌ యూనియన్లు మద్దతు ప్రకటించాయి. ఆటోల యూనియన్లు, లారీల సంఘాలు, ప్రైవేట్‌ వాహనాల యాజమాన్య సంఘాలు, తెలంగాణా జూనియర్‌ న్యాయవాదుల సంఘం మద్దతు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ జేఏసీ, విద్యుత్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు, కార్మిక విభాగాలు, అగ్రిడాక్టర్స్‌ అసోసియేషన్‌, రవాణాశాఖ గెజిటెడ్‌ అధికారుల సంఘం టిజేఎఫ్‌, తెమ్జూ, తెలంగాణ నెటిజన్స్‌ఫోరం, పాలిటెక్నిక్‌ లెక్చరర్ల సంఘం, రికగ్నైజ్డ్‌ ప్రైవేట్‌ టీచర్స్‌ అసోసియేషన్‌, వైద్యశాఖ జేఏసీ, సాంఘిక సంక్షేమశాఖ గురుకుల అధ్యాపకులు, సిబ్బందిల జేఎసి, తెలంగాణ ఐకెపి ఉద్యోగులు, తెలంగాణ ప్రజాఫ్రంట్‌, వ్యాయామ ఉపాద్యాయుల సంఘం, తెలంగాణ ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా, అమరవీరుల కుటుంబవేదిక, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు, కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌లు సైతం తమ మద్దతు ప్రకటించాయి. సామాజికాంధ్ర జేఏసీ, కుమ్మరి సంఘం, గృహనిర్మాణ కార్మిక సంఘాలు, పంచాయితీరాజ్‌శాఖ ఉద్యోగులు, ఇంజనీర్ల సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. అర్ధరాత్రి నుంచే తెలంగాణ జిల్లాల్లోని బస్‌డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు, తెలంగాణవాదులు బైటాయించారు. హైదరాబాద్‌కు వచ్చే హైదరాబాద్‌-విజయవాడ హైవే, హైదరాబాద్‌-బెంగళూర్‌ హైవేలపై తెలంగాణవాదులు పెద్ద ఎత్తున బైఠాయించారు. ఖమ్మం జిల్లాలో సమైక్య సభకు వెళ్తున్న బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారు.