సిటీ కాలేజీ, గన్‌పార్క్‌ వద్ద ముల్కీ అమరులకు ఘనంగా నివాళి


హైదరాబాద్‌ సిర్ఫ్‌ హమారా
నినదించిన పోరుబిడ్డలు
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రాంత యువతకు దక్కాల్సిన ఉద్యోగాలను కొల్లగొట్టిన వారికి వ్యతిరేకంగా ఉద్యమించి రాజ్యహింసలో మృతిచెందిన ముల్కీ అమరవీరులకు శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఐదుగురు యువకులు బలిదానం చెందిన సిటీ కాలేజీతో పాటు తెలంగాణ అమరవీరుల స్తూపం గన్‌పార్క్‌ వద్ద తెలంగాణవాదులు ముల్కీ అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌, తెలంగాణ ప్రజాఫ్రంట్‌ నాయకులు వేదకుమార్‌, ఆకుల భూమయ్య, ఉద్యోగ సంఘాల నేత రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైన తర్వాత ఇతర ప్రాంతాల ఉద్యోగులను తీసుకొచ్చి తెలంగాణపై రుద్దడాన్ని ఆరోజే వ్యతిరేకించిన అమరులు అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. వారి త్యాగాల స్ఫూర్తితో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి తీరుతామని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో సీమాంధ్రుల కుట్రలను సమర్థవంతంగా తిప్పికొడతామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ తెలంగాణ అంతర్భాగమని, ఇక్కడి ప్రజల రక్తమాంసాలు దారపోసి నిర్మించుకున్న నగరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులకోబోమని తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వేళ కుట్ర రాజకీయాలు చేస్తున్న సీమాంధ్ర పార్టీలకు తెలంగాణ చోటు లేకుండా చేస్తామని, వాటిపి భూస్తాపితం చేస్తామని హెచ్చరించారు. ముల్కీ నిబంధనలు తుంగలో తొక్కి ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం తర్వాత సీమాంధ్రులు ఇక్కడి వారికి దక్కాల్సిన ఉద్యోగాలను కొళ్లగొట్టారని తెలిపారు. బతకడానికి వచ్చిన వారు హైదరాబాద్‌పై హక్కులు అడుగుతుంటే చూస్తే ఊరుకోబోమన్నారు. ఇక్కడ నివసించే వారంతా హైదరాబాదీలేనని, అయితే ఇక్కడి సొమ్ము తింటూ సీమాంధ్ర పాటపాడే వారు మాత్రం తెలంగాణ వీడక తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్‌ ముమ్మాటికీ తెలంగాణలో అంతర్భాగమని నినదించారు. గన్‌పార్క్‌ వద్ద ముల్కీ అమరులకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. కార్యక్రమంలో వివిధ జేఏసీల ప్రతినిధులు, తెలంగాణవాదులు పాల్గొన్నారు.